దర్యాప్తు కీలక దశలో ఉంది.. అభిషేక్ రావును రిమాండ్‌‌కు ఇవ్వాలన్న సీబీఐ అధికారులు

దర్యాప్తు కీలక దశలో ఉంది..  అభిషేక్ రావును రిమాండ్‌‌కు ఇవ్వాలన్న సీబీఐ అధికారులు
  • రూ.3.8 కోట్ల హవాలా సొమ్ముతో పాటు ఆధారాలు సేకరించాల్సి ఉందని వెల్లడి
  • ఐదు రోజుల సీబీఐ కస్టడీ ముగియడంతో రిమాండ్‌‌ విధించిన కోర్టు

హైదరాబాద్‌‌, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌‌ కేసులో బోయినపల్లి అభిషేక్‌‌రావు సీబీఐ కస్టడీ ముగిసింది. ఐదు రోజుల కస్టడీ శనివారంతో ముగియడంతో ఢిల్లీ రూస్‌‌ అవెన్యూలోని సీబీఐ స్పెషల్‌‌ కోర్టులో ఆయనను ప్రవేశపెట్టారు. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున అభిషేక్‌‌రావుకు రిమాండ్‌‌ విధించాలని సీబీఐ అధికారులు కోర్టును కోరారు. దీంతో 14 రోజులు జ్యుడీషియల్‌‌ రిమాండ్‌‌కు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. అభిషేక్‌‌రావు నుంచి సేకరించిన వివరాల ఆధారంగా రాష్ట్రం నుంచి రూ.3.8 కోట్ల హవాలా సొమ్ము తరలింపుపై సీబీఐ దర్యాప్తు చేయనుంది. ఈ కేసులో 14వ నిందితుడిగా ఉన్న అరుణ్‌‌ రామచంద్ర పిళ్లైని కూడా విచారించనుంది. వివిధ కారణాలతో రామచంద్ర పిళ్లైని విచారించలేదని కోర్టుకు తెలిపింది. 

కస్టడీలో కీలక ఆధారాలు!

ఐదు రోజుల కస్టడీలో సీబీఐ అధికారులు కీలక వివరాలు రాబట్టినట్లు సమాచారం. లిక్కర్ పాలసీని మార్చేందుకు జరిగిన కుట్రలో అభిషేక్‌‌రావు కూడా మీటింగ్స్‌‌లో పాల్గొన్నట్లు విచారణలో గుర్తించినట్లు తెలిసింది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌‌లోని వివిధ స్టార్‌‌‌‌ హోటల్స్‌‌లో జరిగిన మీటింగ్స్‌‌లో పాల్గొన్న వారి వివరాలను సీబీఐ ఇప్పటికే సేకరించింది. వీటి ఆధారంగానే అభిషేక్‌‌రావును ప్రశ్నించినట్లు తెలిసింది. ఇందులో ఫ్లైట్‌‌ టికెట్స్‌‌ బుక్‌‌ చేసిన కంపెనీలు, వాటి డైరెక్టర్స్‌‌ ఇచ్చిన స్టేట్‌‌మెంట్స్ అభిషేక్‌‌ స్టేట్‌‌మెంట్‌‌తో కలిపి పరిశీలించినట్లు తెలిసింది. లిక్కర్ పాలసీ ప్రపోజల్స్‌‌కి ముందు హైదరాబాద్‌‌ నుంచి వచ్చిన వారి గురించి సీబీఐ ఆరా తీసినట్లు సమాచారం. ఇంగ్లీష్‌‌ చానల్ అకౌంట్‌‌కి ట్రాన్స్‌‌ఫర్ చేసిన సొమ్ముకు సంబంధించిన వివరాలను కూడా రాబట్టినట్లు తెలిసింది.

హవాలాపైనే ఫోకస్..

అభిషేక్‌‌రావు కంపెనీలతో లింకైన బ్యాంక్‌‌ అకౌంట్స్‌‌ను సీబీఐ అధికారులు పరిశీలించినట్లు తెలిసింది. ప్రతి ట్రాన్సాక్షన్‌‌కి సంబంధించిన వివరాలతో అభిషేక్‌‌ స్టేట్‌‌మెంట్‌‌ను రికార్డ్‌‌ చేసినట్లు సమాచారం. ఆయా కంపెనీలకు చెందిన ఆడిట్‌‌ రికార్డ్‌‌లను సీబీఐ అధికారులు చెక్‌‌ చేసినట్లు తెలిసింది. రాష్ట్రంలోని పలువురు రాజకీయ నేతలు, లిక్కర్ వ్యాపారుల నుంచి పెద్ద మొత్తంలో జరిగిన హవాలా డబ్బుపైనేనా సీబీఐ ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం.