ఆదిలాబాద్ టౌన్/మంచిర్యాల, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ గురువారం బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌లోని బీసీ వెల్ఫేర్కార్యాలయం ముందు నేతలు మౌన దీక్ష చేశారు. నోటికి నల్ల గుడ్డలు కట్టుకొని నిరసన తెలిపారు.
ప్రభుత్వాలు బీసీల పట్ల రెండు నాలుకల ధోరణిని అవలంబిస్తున్నాయని మండిపడ్డారు. 42 శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు దత్తు, ప్రధాన కార్యదర్శి కలాల శ్రీనివాస్, చంద్రకిరణ్తదితరులు పాల్గొన్నారు.
బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చాలి
42 శాతం బీసీ రిజర్వేషన్లను రాజ్యాంగం 9వ షెడ్యూల్లో చేర్చాలని, ఇందుకు బీజేపీ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నీలకండేశ్వర్ గౌడ్ డిమాండ్ చేశారు. బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో ఆందోళన చేశారు.
ఆయన మాట్లాడుతూ.. గతంలో ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లను న్యాయస్థానాలు వ్యతిరేకించినప్పటికీ బీజేపీ ప్రభుత్వం 9వ షెడ్యూల్లో చేర్చి చట్టబద్ధత కల్పించిందని, అదే రీతిలో బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చాలన్నారు. లేకపోతే దేశంలో మెజారిటీ శాతం ఉన్న బీసీలు బీజేపీకి దూరమవుతారని హెచ్చరించారు. కందు శ్రీనివాస్, కనుకుంట్ల మల్లయ్య, రాజేశం గౌడ్, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
