ఒమన్ తీరంలో నీట మునిగిన భారత నౌక..14 మంది సిబ్బంది సేఫ్.. ఇంజిన్‌‌‌‌ ఫెయిల్యూరే కారణం: ఇండియన్‌‌‌‌ ఎంబసీ

ఒమన్ తీరంలో  నీట మునిగిన భారత నౌక..14 మంది సిబ్బంది సేఫ్.. ఇంజిన్‌‌‌‌ ఫెయిల్యూరే కారణం: ఇండియన్‌‌‌‌ ఎంబసీ
  • కొద్దిసేపటికే సముద్రంలో మునిగిపోయిన షిప్

మస్కట్‌‌‌‌: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ.. ఒమన్‌‌‌‌ తీరంలో భారత వాణిజ్య నౌక ఒకటి నీట మునిగింది. ఇంజిన్ వైఫల్యం కారణంగా నడి సముద్రంలో నౌక నిలిచిపోయింది. దీంతో వెంటనే స్పందించిన ఒమన్ రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి ఆ నౌకలోని 14 మంది భారతీయ సిబ్బందిని రక్షించి, ఒమన్ తీరానికి చేర్చాయి. ప్రమాదానికి గురైన ఈ షిప్‌‌‌‌ను ‘మెకనైజ్డ్ సెయిలింగ్ వెసెల్ (ఎంఎస్‌‌‌‌వీ) విరాట్– 1’ గా గుర్తించారు. సిబ్బందిని కాపాడిన కొద్దిసేపటికే ఈ నౌక సముద్రంలో మునిగింది. ఒమన్ అధికారులు, స్థానిక నౌకల సమన్వయంతో ఈ ఆపరేషన్ విజయవంతంగా ముగిసిందని ఇండియన్‌‌‌‌ ఎంబసీ వెల్లడించింది.

ప్రాణాలు కాపాడిన రైఫ్ లాఫ్ట్

సాంకేతిక లోపం కారణంగా నౌక మునిగిపోయే పరిస్థితి రావడంతో సిబ్బంది అలర్ట్ అయ్యారు. సాయం కోసం అత్యవసర సందేశం పంపించారు. ఈ మెసేజ్ అందుకున్న ఒమన్ అధికారులు వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. మారిటైమ్ పెట్రోల్ ఎయిర్‌‌‌‌క్రాఫ్ట్ (సముద్ర నిఘా విమానం) ద్వారా లైఫ్ రాఫ్ట్ (రక్షణ పడవ)ను భారతీయ నావికులకు అందేలా చేశారు. ఈ రాఫ్ట్ సాయంతో నౌకలో నుంచి వారంతా బయటపడ్డారు.‘‘14 మంది భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న భారతీయ పతాకం కలిగిన ‘విరాట్ 1’ నౌక ఒమన్ తీరంలో ప్రమాదానికి గురైనట్లు మాకు సమాచారం అందింది. 

ఒమన్ అధికారులు, ఆ ప్రాంతంలో ఉన్న ఇతర నౌకల సహాయంతో గాలింపు, రక్షణ చర్యలు చేపట్టాం” అని ఇండియన్‌‌‌‌ ఎంబసీ ఒక ప్రకటనలో పేర్కొంది. గత వారంలో ఒమన్ గల్ఫ్ పరిధిలో అమెరికా నావికాదళం జరిపిన దాడుల్లో భారతీయ సిబ్బంది ఉన్న 3 విదేశీ నౌకలు లక్ష్యంగా మారిన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుత ‘విరాట్ 1’ నౌక ప్రమాదానికి ఆ దాడులతో సంబంధం లేదని, ఇది కేవలం సాంకేతిక లోపం వల్ల జరిగిన ప్రమాదం మాత్రమేనని అధికారులు స్పష్టం చేశారు. 

గల్ఫ్‌‌‌‌లో  భారతీయులనే లక్ష్యంగా చేసుకుంటున్నారు.. వీడియో వైరల్‌‌‌‌

ఇరాన్, హార్మూజ్‌‌‌‌ జలసంధి సమీపంలో వాణిజ్య నౌకలపై పనిచేస్తున్న భారతీయ నావికులు పంపిన సహాయక(డిస్ట్రెస్) సందేశాలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. భారతీయ నావికులు ఉన్న నౌకలపైనే పదే పదే దాడులు జరుగుతున్నాయని సిబ్బంది ఆరోపిస్తున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకుపోయిన భారతీయ నావికులు, తాము ఎదుర్కొంటున్న ప్రమాదకర పరిస్థితులను వివరిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌‌‌‌గా మారాయి. 

‘‘మేం ఇరాన్‌‌‌‌లో ఉన్నాం.. ఇక్కడి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. భారతీయ సిబ్బంది ఉన్న నౌకలే టార్గెట్​గా దాడులు చేస్తున్నారు. ఎవరిదో పోరాటంలోకి మమ్మల్ని ఎందుకు లాగుతున్నారు? మేం సైనికులం కాదు.. కాంట్రాక్టుపై పనిచేసే నావికులం. ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణా చేస్తూ, వ్యాపారాలను వృద్ధి చేస్తూ ఆర్థిక వ్యవస్థకు సాయపడుతున్నాం” అని ఆవేదన వ్యక్తంచేశారు.