14 మంది సర్పంచులు రాజీనామా...ప్రభుత్వ తీరుకు నిదర్శనం : రామ్మోహన్ రెడ్డి

14 మంది సర్పంచులు రాజీనామా...ప్రభుత్వ తీరుకు నిదర్శనం : రామ్మోహన్ రెడ్డి

వికారాబాద్ జిల్లా పరిగి బస్టాండ్ ముందు కాంగ్రెస్ నాయకులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన.. 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్ళిస్తోందని వారు ఆరోపించారు. హైదరాబాద్– బీజాపూర్ హైవేపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిదానాలు చేస్తూ తమ నిరసన కొనసాగించారు. నిరసన కార్యక్రమంలో పరిగి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డితో పాటు వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.

గత కొన్ని నెలలుగా నిధుల లేమితో గ్రామ పంచాయతీలు కొట్టుమిట్టాడుతున్న సమయంలో.. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను సర్పంచుల ప్రమేయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించడం పై పలువురు సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధుల దుర్వినియోగం జరగవద్దనే ఉద్దేశంతో డిజిటల్ కీలు ఏర్పాటు చేసినప్పటికీ.. వాటిని సర్పంచులకు అప్పజెప్పకుండానే ఎంపీడీవోలు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నేరుగా గ్రామపంచాయతీ నిధులను దారి మళ్ళించారని ఆరోపించారు. గ్రామాల అభివృద్దిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన  పనులన్నీ నిధులు లేకున్నా అప్పులు చేసి పూర్తి చేసినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం తమని వేధిస్తోందని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటితో తమ ఉద్యమం ఆగదని, గ్రామాల నుంచి ప్రజలను తీసుకొచ్చి ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. ఆసిఫాబాద్ కు చెందిన 14 మంది సర్పంచులు రాజీనామా చేయడమే రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని దుయ్యబట్టారు.