కరోనా టెన్షన్: 148 మంది సిక్కు యాత్రికులకు పాజిటివ్

కరోనా టెన్షన్: 148 మంది సిక్కు యాత్రికులకు పాజిటివ్

చండీగఢ్: తబ్లిగీ ఘటనతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య దరిమిలా పెరిగిన నేపథ్యంలో పంజాబ్ కు సిక్కు యాత్రికుల టెన్షన్ ఎక్కువైంది. మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి పంజాబ్ కు తిరిగొచ్చిన వారిలో 542 మంది సిక్కు యాత్రికులకు టెస్టులు నిర్వహించారు. వారిలో 148 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. నాందేడ్ లోని హజూర్ సాహిబ్ గురుద్వారాలో దాదాపు 3,700 మంది యాత్రికులు చిక్కుకున్నారని తెలుస్తోంది. ప్రభుత్వ నివేదిక ప్రకారం.. గత మూడ్రోజుల్లో నాందేడ్ నుంచి పంజాబ్ కు తిరిగొచ్చిన 3,500 మంది యాత్రికులను అక్కడి ప్రభుత్వం వివిధ ప్రాంతాల్లో క్వారంటైన్ లో ఉంచింది. యాత్రికులను రప్పించడానికి పంజాబ్ సర్కార్ 80 బస్సులను నాందేడ్ కు పంపించింది. కాగా, వందలాది మంది యాత్రికులు గత నెల 26వ తేదీకి ముందే పంజాబ్ చేరుకున్నారని సమాచారం. వీరిని చెక్ పోస్టుల వద్ద ఆపలేదని, స్క్రీనింగ్ కూడా చేయలేదని తెలుస్తోంది. పంజాబ్ లోని తమ ఇళ్లకు చేరుకున్న వారిలో దాదాపు 200 మందికి పైగా యాత్రికులు ఉంటారని, వారు ప్రైవేటు వాహనాల్లో సొంత రాష్ట్రానికి తిరిగొచ్చారని సెక్యూరిటీ ఏజెన్సీలు చెప్తున్నాయి. వీరిని గుర్తించి హోం క్వారంటైన్ లో ఉంచేందుకు హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారులు జల్లెడ పడుతున్నారు. ప్రస్తుతం పంజాబ్ లో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 357కు చేరగా, 19 మంది చనిపోయారు.