రోజుకో స్పూన్​ నెయ్యి బరువు తగ్గియ్యి

రోజుకో స్పూన్​ నెయ్యి బరువు తగ్గియ్యి

వేడివేడి అన్నంలో ముద్దపప్పు, నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే అబ్బో స్వర్గానికి ఇంచు దూరంలో ఉన్నట్టే అనిపిస్తుంది కొందరికి. ఇంకొందరేమో నిల్వ పచ్చడి, రోటి పచ్చడి, కూర... ఏదైతేనేం నెయ్యి కలుపుకుని తింటే కానీ నోటికి రుచి తగలదు అంటారు. అన్నంలోనే కాదు పూర్ణం బూరెల్లో, బొబ్బట్ల మీద నెయ్యి పోసుకుని తింటుంటారు. తినే రుచికరమైన ఆహారానికి నెయ్యి జత చేరితే టేస్టీగా మారతాయనడంలో సందేహం లేదు. 

అయితే నెయ్యి తింటే కొవ్వు పెరిగిపోతుంది. గుండెకు మంచిది కాదు. బరువు పెరుగుతామనే భయంతో చాలామంది నెయ్యి తినడం మానేస్తున్నారు. అలా నెయ్యి తినడాన్ని పూర్తిగా మానేయొద్దు. శరీరానికి అందాల్సిన పోషకాలు కొన్ని అందకుండా పోతాయి అంటున్నారు హెల్త్​ ఎక్స్​పర్ట్స్​. ప్రతిరోజూ నెయ్యి తినడం వల్ల శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటే.. వాడాలా? వద్దా? అనేది డిసైడ్​ చేసుకోవచ్చు.

    నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్స్​, కొవ్వులో కరిగే విటమిన్స్​ ఎ, డి, ఇ, కెలు ఉంటాయి. ఈ న్యూట్రియెంట్స్​ శరీరాన్ని సరిగ్గా పనిచేసేలా చేస్తాయి. అదొక్కటే కాకుండా ఇమ్యూన్​ సిస్టమ్​ నుంచి బ్రెయిన్​ బాగా పనిచేసేవరకు సాయం చేస్తాయి. తిన్న ఆహారంలో కొవ్వులో కరిగే మినరల్స్​, విటమిన్స్​ ఉంటాయి. వాటిని శోషించుకోవడానికి నెయ్యి సాయం చేస్తుంది. 

     ఇందులోని ఒమెగా3 ఫ్యాటీ యాసిడ్స్​ కార్డియో వాస్క్యులర్​ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రోజుకి ఒక స్పూన్​ నెయ్యి తింటే సీరమ్​ కొలెస్ట్రాల్​ లెవల్స్​ తగ్గుతాయి. కరోనరీ ఆర్టరీ వ్యాధు​ల బారిన పడకుండా ఉండొచ్చు. కీళ్లు, త్వచాల​ను ల్యూబ్రికెంట్​గా ఉంచుతాయి. అలాగే నెయ్యిలో కాంజుగేటెడ్​ లినెలిక్​ యాసిడ్​ (సిఎల్​ఎ) ఉంటుంది. ఇది కార్డియో వాస్క్యులర్ వ్యాధుల బారిన పడకుండా చేయడమే కాకుండా క్యాన్సర్​ కారక ఏజెంట్లతో పోరాడుతుంది. 

    ఎసెన్షియల్​ ఫ్యాటీ యాసిడ్స్​.. పొడి బారి, నిర్జీవంగా కనిపించే చర్మానికి జీవాన్ని ఇస్తాయి. చర్మానికి తేమ అంది మృదువుగా అవుతుంది. అన్ని రకాల చర్మాల వాళ్లూ నెయ్యిని వాడొచ్చు. అలాగే జుట్టు మందంగా పెరగాలన్నా, మెరిసిపోవాలన్నా నెయ్యి తినాల్సిందే. 

    ఇందులో ఉన్న బ్యూట్రిక్​ యాసిడ్​కి ఇన్​ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. దీనివల్ల శరీరంలో వాపు, మంట తగ్గుతాయి.
 ​
     నెయ్యిని గోరు వెచ్చని నీళ్లతో కలిపి తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం సమస్య దరిచేరదు. కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి సమస్యలు కూడా ఉండవు. తిన్న పదార్థాల్లోని పోషకాలను పేగుల్లోని గోడలు శోషించుకునేలా చేస్తుంది. పేగులకు సంబంధించిన సమస్యలు ఉన్నవాళ్లు రోజుకి ఒక స్పూన్​ నెయ్యి తినడం చాలా మంచిది. 

     పనిచేసినా.. చేయకపోయినా నీరసంగా ఉంటారు కొందరు. ఇలాంటి వాళ్లు నెయ్యిని ఆహారంలో చేర్చడం తప్పనిసరి. ఎందుకంటే ఒక టేబుల్​స్పూన్​ నెయ్యిలో112 క్యాలరీలు ఉంటాయి. ఇందులో మీడియం చెయిన్ ఫ్యాటీ యాసిడ్స్​ ఉంటాయి. శరీరం వీటిని శోషించుకుని శక్తిని ఇస్తుంది నెయ్యి. 

     నెయ్యిలో ఉండే లినెలిక్​ యాసిడ్​ బరువు తగ్గేలా చేయడమే కాకుండా శరీరంలో కొవ్వుని​ కూడా కరిగిస్తుంది. బరువు తగ్గాలి అనుకునే వాళ్లు హెల్దీ డైట్​ తినడం, ఎక్సర్​సైజ్​ చేయడంతో పాటు నెయ్యి తింటే ఫలితం మరింత బాగుంటుందన్నమాట.

     చలికాలంలో వెచ్చగా ఉండాలంటే నెయ్యి ఒంట్లో పడాల్సిందే. దీనివల్ల దగ్గు, జలుబు రావు. ఒకవేళ జలుబు చేసి ముక్కులు మూసుకుపోయినా నెయ్యి తింటే ఉపశమనం కలుగుతుంది. త్వరగా జలుబు ఇన్ఫెక్షన్​ తగ్గాలంటే కొంచెం నెయ్యి తీసుకుని ముక్కుపుటాల దగ్గర రుద్దాలి. ఇలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్​ త్వరగా తగ్గుతుందంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

రోజూ నెయ్యి తినడం వల్ల ఇక్కడ చెప్పినవే కాకుండా మరెన్నో లాభాలు ఉన్నాయి. కాకపోతే మంచిది కదా.. అని ఎడాపెడా వాడకూడదు. రోజుకి ఒక టేబుల్​ స్పూన్​ నెయ్యి మాత్రమే వాడాలి.