ట్రక్కు, బస్సు ఢీ.. 15 మంది మృతి

ట్రక్కు, బస్సు ఢీ.. 15 మంది మృతి
  • కెనడాలో ఘోర ప్రమాదం

టొరంటో: కెనడాలో ఘోర ప్రమాదం జరిగింది. ట్రక్కు, బస్సు ఢీకొని 15 మంది చనిపోయారు. పది మందికిపైనే గాయపడ్డారు. బస్సులో ప్రయాణిస్తున్న వారందరూ సీనియర్ సిటిజన్లే. బస్సులో వారు మానిటోబా ప్రావిన్స్ లోని కార్ బెర్రీ సిటీలో ఓ క్యాసినోకు వెళ్తుండగా హైవేలో గురువారం ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, ఫైర్ ఫైటర్లు ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్​ చేపట్టారు.

గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు. రెండు వాహనాలు ఢీకొన్న ప్రాంతం బీభత్సంగా మారింది. వాహనాల అద్దాలు, శకలాలు ఊడి రోడ్డుపై పడిపోయాయి. ట్రక్కు ఇంజన్  పూర్తిగా దెబ్బతిన్నది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 25 మంది ఉన్నారని అధికారులు తెలిపారు. ఈస్ట్  బౌండ్  లేన్స్ ను క్రాస్ చేస్తున్న బస్సును ట్రక్కు ఢీకొట్టిందని చెప్పారు. ప్రమాదంపై ఎంక్వయిరీ చేస్తున్నామని వెల్లడించారు. ఈ ప్రమాదంపై ప్రధాని జస్టిన్  ట్రూడో దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ట్వీట్  చేశారు.

మంటల్లో కాలిపోయిన బస్సు

ఈ ప్రమాదంలో బస్సు మంటల్లో కాలిపోయిందని హైవే పక్కన బిజినెస్  నిర్వహించే నిర్మేష్  వాడేరా అనే వ్యక్తి తెలిపాడు. బాధితులను బయటకు తీసేందుకు రెస్క్యూ సిబ్బందితో పాటు స్థానికులు కూడా కష్టపడ్డారని వివరించారు.