విరాట్ కోహ్లీ ఎంట్రీకి నేటితో 15 ఏళ్లు.. తొలి మ్యాచ్‌లో గంభీర్‌తో క‌లిసి ఓపెనింగ్

విరాట్ కోహ్లీ ఎంట్రీకి నేటితో 15 ఏళ్లు.. తొలి మ్యాచ్‌లో గంభీర్‌తో క‌లిసి ఓపెనింగ్

టీమిండియా మాజీ సారథి, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ అంత‌ర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి నేటితో 15 ఏళ్లు గ‌డిచాయి. 2008 ఆగస్టు 18న శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌ ద్వారా అరంగేట్రం చేసిన విరాట్.. అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు ప్రపంచ క్రికెట్‌లో రారాజుగా వెలుగొందుతున్నాడు. అతని ఈ పదిహేనేళ్ల క్రికెట్ ప్రయాణం ఎందరో యువ క్రికెటర్లకు స్ఫూర్తిదాయకం అని చెప్పుకోవాలి.

అండ‌ర్‌-19 కెప్టెన్‌గా 2008లో దేశానికి వ‌ర‌ల్డ్‌క‌ప్‌ అందించిన కోహ్లీ.. తన క్రికెట్ కెరీర్‌ను ఘనంగా ఆరంభించాడనే చెప్పాలి. ఆపై కొన్నాళ్లకే జాతీయ జట్టులోకి అడుగుపెట్టి.. అక్కడా తన మార్క్ చూపించాడు. ఆరంభంలో కొన్నాళ్లు పరుగుల కోసం నిరీక్షించినా.. కాలం గడిచేకొద్దీ అవి తనకు బానిసలయ్యాయి. ఫార్మాట్ ఏదైనా ప‌రుగుల వ‌ర‌ద పారిచండం అత‌డికి వెన్న‌తో పెట్టిన విద్య‌లా మారిపోయింది.

గంభీర్‌తో క‌లిసి ఓపెనింగ్

కోహ్లీ త‌న తొలి మ్యాచ్‌లో ఢిల్లీ టీమ్‌మేట్ గంభీర్‌తో క‌లిసి ఓపెనింగ్ చేశాడు. ఆ మ్యాచ్‌లో అతను 12 పరుగులు మాత్రమే చేశాడు. ఆలా మొదలైన అతని క్రికెట్ ప్రయాణం.. నేటితో 15 ఏళ్ల పూర్తి చేసుకోవ‌డం అంటే మాటలు కాదు. అలా అని ఈ పదిహేనేళ్ల అతని క్రికెట్ ప్రయాణం ఒకేలా సాగలేదు. ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. పరుగులు చేయలేక తడబడ్డప్పుడు.. విమర్శించని నోరు లేదు. వాటన్నింటికీ మౌనంతోనే సమాధానమిచ్చాడు.

 275 వన్డేలు, 111 టెస్టులు, 115 టీ20లు

ఇప్ప‌టివ‌ర‌కూ తన అంతర్జాతీయ కెరీర్‌లో 275 వన్డేలు, 111 టెస్టులు, 115 టీ20లు ఆడిన కోహ్లీ.. టెస్టుల్లో 8676, వన్డేల్లో 12,898, టీ20 క్రికెట్‌లో 4008 పరుగులు చేశాడు. అత్యధికంగా వన్డేల్లో 46 సెంచరీలు చేసిన విరాట్.. టెస్టుల్లో 26, టీ20ల్లో ఒక అంతర్జాతీయ సెంచరీ నమోదుచేశాడు.

అరుదైన రికార్డులు

  • అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన రెండో క్రికెట‌ర్.. కోహ్లీ(76). 
  • టీ20 క్రికెట్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక ర‌న్స్ చేసింది కూడా కోహ్లీనే.
  • ఎక్కువ సార్లు ప్లేయ‌ర్ ఆఫ్ సిరీస్ అవార్డులు గెలిచిన ఆటగాడు.. కోహ్లీనే(20). 
  • వ‌న్డేల్లో అత్య‌ధిక సంఖ్య‌లో క్యాచ్‌లు(142) పట్టిన రికార్డు కూడా కోహ్లీపేరిటే ఉంది.