చెన్నై: మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురుకు చెందిన ఈషా ఫౌండేషన్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. కోయంబత్తూర్ పట్టణ సమీపంలో ఉన్న ఇషా ఫౌండేషన్లో ఇవాళ (అక్టోబర్ 2) దాదాపు 150 మంది పోలీసులు సెర్చ్ చేశారు. అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ ఆఫీసర్ నేతృత్వంలో 150 మంది పోలీసు సిబ్బంది ఇషా ఆశ్రమానికి వెళ్లి పరిశీలించారు. ఆశ్రమంలోని ఖైదీలు, సన్యాసం తీసుకున్న పలువురితో మాట్లాడటంతో పాటు.. ఫౌండేషన్‌లోని గదులను క్షుణ్ణంగా తనిఖీ చేసినట్లు అధికారులు తెలిపారు.
పోలీసుల తనిఖీలపై ఈషా ఫౌండేషన్ నిర్వాహకులు స్పందించారు. కోర్టు ఆదేశాల ప్రకారం ఆశ్రమంలో పోలీసులు సాధారణ విచారణ కోసం వచ్చారని తెలిపారు. అధికారులు ఆశ్రమంలోని నివాసితులు, వాలంటీర్లను విచారిస్తున్నారని పేర్కొన్నారు. ఆశ్రమంలో ఉండే వారి జీవన శైలి గురించి అడిగి తెలుసుకుంటూ.. అసలు వాళ్లు ఇక్కడికి ఎలా వచ్చారు.. ఇక్కడ ఏం చేస్తున్నారు అనే విషయాలపై ఆరా తీస్తున్నారని తెలిపారు.
అసలేం జరిగిందంటే..?
రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ కామరాజ్ అనే వ్యక్తి తన ఇద్దరు కూతుర్లను సద్గురుకు చెందిన ఈషా ఫౌండేషన్లో బలవంతంగా బంధించారని.. వారిని తిరిగి తమకు అప్పగించాలని మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సంస్థ వ్యక్తులను బ్రెయిన్‌వాష్ చేసి, వారిని సన్యాసులుగా మారుస్తూ వారి కుటుంబాలతో సంబంధాలను తెంచేస్తోందని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు విచారణ చేపట్టగా.. కామరాజ్ ఇద్దరు కూతుర్లు కోర్టుకు హాజరై తమ ఇష్టపూర్వకంగానే ఆశ్రమంలో ఉంటున్నామని.. తమను ఎవరూ నిర్భందించలేదని తెలిపారు.
విచారణ సందర్భంగా మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తన ఇద్దరు కూతుర్లకు పెళ్లిళ్లు చేసిన సద్గురు.. మిగిలిన యువతులను మాత్రం సన్యాసంలోకి మారాలని ఎందుకు ప్రోత్సహిస్తున్నారని హైకోర్టు సూటిగా ప్రశ్నించారు. సద్గురు ఆశ్రమంలో తనిఖీలు చేపట్టి.. ఈషా ఫౌండేషన్కు చెందిన పాత క్రిమినల్ కేసుల రికార్డ్‌ను సబ్మిట్ చేయాలని న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు ఇవాళ ఈషా ఫౌండేషన్లో సోదాలు చేశారు.