
హోమ్ క్వారంటైన్‌లో ఉన్న 15 ఏళ్ల బాలుడు సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కర్ణాటకలోని ఉడుపి జిల్లా సాలిగ్రామ పట్టణంలో జరిగింది. సాలిగ్రామకు చెందిన 15 ఏళ్ల బాలుడు కోటలో టెన్త్ క్లాస్ చదువుతున్నాడు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆ కుర్రాడు సాలిగ్రామలో ఉంటున్న తల్లి దగ్గరకు వచ్చేశాడు. అతడి తల్లి ఓ ఇంట్లో పని మనిషిగా వర్క్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. అయితే ఆమె పని చేస్తున్న ఇంట్లో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఈ తల్లీబిడ్డలను హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా అధికారులు సూచించారు. దీంతో కొద్ది రోజులుగా వారు ఇంట్లోనే ఉంటున్నారు. ఏం జరిగిందో ఏమో మంగళవారం ఆ బాలుడు తన గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉదయం కుమారుడిని ఆ స్థితిలో చూసిన ఆ మాతృమూర్తి తల్లడిల్లిపోయింది. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో వారు ఆ బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, డిప్రెషన్ వల్ల ఆ కుర్రాడు ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నామని చెప్పారు పోలీసులు. మృతదేహానికి కరోనా టెస్టు చేసిన తర్వాత అంత్యక్రియలకు పంపనున్నట్లు తెలిపారు.