ఉక్రెయిన్ నుంచి ఇయ్యాల మరో 1,500 మంది వస్తరు

ఉక్రెయిన్ నుంచి ఇయ్యాల మరో 1,500 మంది వస్తరు
  •    ఇయ్యాల మరో 1,500 మంది వస్తరు: కేంద్రం 
  •     తెలంగాణ వాళ్లు     625 మంది వచ్చిన్రు 
  •     ఇంకా ఉక్రెయిన్ లో ఉన్నోళ్లు సమాచారం ఇవ్వాలని ఎంబసీ సూచన

న్యూఢిల్లీ, వెలుగు: ‘‘ఆపరేషన్ గంగ’’లో భాగంగా ఇప్పటి వరకు ఉక్రెయిన్ నుంచి 15,908 మంది మనోళ్లను తీసుకొచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం ఆదివారం వెల్లడించింది. 66 ప్రైవేట్ ఫ్లైట్లలో 13,852 మందిని తరలించామని తెలిపింది. మరో 10 ఎయిర్ ఫోర్స్ విమానాల్లో 2,056 మందిని తీసుకొచ్చామని చెప్పింది. ఉక్రెయిన్ పొరుగు దేశాలైన రుమేనియా, హంగరీ, పోలాండ్, స్లోవేకియా నుంచి మనోళ్లను కేంద్రం తరలిస్తోంది. ఉక్రెయిన్ నుంచి ఆదివారం11 ఫ్లైట్లలో 2,135 మందిని తీసుకొచ్చినట్లు వెల్లడించింది. 9 ఫ్లైట్లు ఢిల్లీకి రాగా, రెండు ముంబైకి వచ్చాయని తెలిపింది. సోమవారం మరో 8 ఫ్లైట్లలో 1,500 మందిని తీసుకురానున్నట్లు చెప్పింది. రుమేనియాలోని సుసివా నుంచి రెండు, బుకారెస్ట్ నుంచి ఒక్కటి, హంగరీలోని బుడాపెస్ట్ నుంచి 5 విమానాలు వస్తాయని వివరించింది. ఢిల్లీకి చేరిన విమానాల్లో 135 మంది తెలంగాణ స్టూడెంట్లు ఉన్నారు. దీంతో ఇప్పటి వరకు దేశానికి వచ్చిన తెలంగాణ స్టూడెంట్ల సంఖ్య 625కు చేరింది.  

హంగరీ నుంచి చివరి ఫ్లైట్లు.. 

ఉక్రెయిన్ లో చిక్కుకున్న మనోళ్లకు మన ఎంబసీ ఆదివారం సూచనలు చేసింది. ఇప్పటికీ ఉక్రెయిన్ లోనే ఉండిపోయినోళ్లు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. పేరు, పాస్ పోర్టు నెంబర్, ఫోన్ నెంబర్, ఉన్న లొకేషన్ వివరాలను గూగుల్ ఫారంలో పంపాలని కోరింది. ట్విట్టర్ లో ఫారంను షేర్ చేసింది. అక్కడున్నోళ్లందరూ వెంటనే దాన్ని నింపాలని సూచించింది. కాగా, హంగరీ నుంచి మనోళ్ల తరలింపు చివరి దశకు చేరుకుందని అక్కడి ఎంబసీ తెలిపింది. ఆ దేశ రాజధాని బుడాపెస్ట్ నుంచి ఆదివారం చివరి ఫ్లైట్లు బయలుదేరుతాయని ట్వీట్ చేసింది. సొంతంగా వేర్వేరు చోట్ల ఉన్నోళ్లందరూ వెంటనే బుడాపెస్ట్ లోని హంగరియా సిటీ సెంటర్ కు చేరుకోవాలని సూచించింది.