
పశ్చిమ బెంగాల్ లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలను అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వరదలకు రోడ్లు, బ్రిడ్జిలు కొట్టుకుపోతున్నాయి. శనివారం (అక్టోబర్ 04) రాత్రి నుంచి కురుస్తున్న వానలకు డార్జీలింగ్ లో కొండచరియలు విరిగిపడ్డాయి. దీనికి తోడు బ్రిడ్జి కూలిపోవడంతో.. మొత్తం17 మంది మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది.
భారీ వర్షాలతో మిరిక్-కుర్సియాంగ్ ప్రాంతాలను కలిపే దుదియా ఐరన్ బ్రిడ్జి కూలిపోయింది. ఈ ప్రమాదంలో 7 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా కొండ చరియలు విరిగిన ఘటనలో చనిపోయిన వారితో కలిసి మొత్తం 17 మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు.
►ALSO READ | 'కుళ్ళిన చికెన్, మురికిగా వంటగది': బెంగళూరు KFCలో షాకింగ్ ఘటన..
భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో డార్జీలింగ్–సిలిగురి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. సిక్కిం రాష్ట్రంతో ఉన్న కనెక్టివిటీ దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. మిరిక్, సుఖియా పొఖారి ప్రాంతంలో కురిసిన వానలకు కొండ చరియలు కూలిపడ్డాయి. దీంతో ఆస్తినష్టం, ప్రాణనష్టం సంభవించింది. పోలీసులు, స్థానిక అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. సోమవారం (అక్టోబర్ 06) సీఎం మమతాబెనర్జీ ప్రభావిత ప్రాంతాలలో పర్యటించనున్నారు.
దుర్గాపూజ కోసం కోల్ కతా వెళ్లిన టూరిస్టులు.. భారీ వర్షాల కారణంగా చిక్కుకుపోయారు. పరిస్థితులు దారుణంగా ఉండటంతో డార్జీలింగ్, టైగర్ హిల్స్, రాక్ గార్డెన్ తదితర టూరిస్టు ప్రాంతాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.