ట్రేడింగ్ పేరుతో 1.8 కోట్ల మోసం

ట్రేడింగ్ పేరుతో 1.8 కోట్ల మోసం
  • ఏపీలోని పీలేరు కేంద్రంగా దందా 
  • ఐదుగురు నిందితుల అరెస్టు 
  • 38 మంది టెలీకాలర్స్​కు నోటీసులు


హైదరాబాద్, వెలుగు: షేర్‌‌ ‌‌మార్కెట్‌‌ ట్రేడింగ్‌‌ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టయింది. డీమ్యాట్‌‌ అకౌంట్‌‌ హోల్డర్లను టార్గెట్‌‌ చేసి, డబ్బులు దండుకున్న ఐదుగురు సభ్యుల ముఠాను సిటీ సైబర్‌‌ ‌‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను డీసీపీ స్నేహ మెహ్రా బుధవారం వెల్లడించారు. అమీర్‌‌‌‌పేట్‌‌కు చెందిన ఓ వ్యక్తికి జూన్‌‌లో ఓ కాల్ వచ్చింది. షేర్ మార్కెట్‌‌ ట్రేడింగ్‌‌పై సూచనలు ఇస్తామని, ఎక్కువ లాభాలు వచ్చే విధంగా టిప్స్‌‌ అందిస్తామని తెలిపారు. కొన్ని షేర్లలో లాభాలు వచ్చినట్టు చూపించారు. ఆ తర్వాత తామే ట్రేడింగ్ చేస్తామని బాధితుడిని నమ్మించి..  అతని డీమ్యాట్ అకౌంట్‌‌ నంబర్, లాగిన్ ఐడీ, పాస్‌‌వర్డ్ తీసుకున్నారు. మొదట్లో కొంతకాలం లాభాలు చూపించారు. అతడి నుంచి రూ.2.6 లక్షలు వసూలు చేసి,  ఆ తర్వాత ఫోన్ చేస్తే రెస్పాండ్ కాలేదు. దీంతో బాధితుడు సిటీ సైబర్‌‌ ‌‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

కాల్ సెంటర్ ఏర్పాటు చేసి.. 
కాల్‌‌ సెంటర్‌‌ నంబర్స్, బ్యాంక్ అకౌంట్స్‌‌ ఆధారంగా ఏపీలోని అన్నమయ్య జిల్లా పీలేరులో కాల్‌‌సెంటర్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. పీలేరుకు చెందిన తిప్పనగరి సాయిసరన్‌‌ కుమార్‌‌‌‌ రెడ్డి ‘ఇంటెగేర్‌‌ కన్సల్టెన్సీ’ పేరుతో షేర్ మార్కెట్‌‌ ట్రేడింగ్‌‌ ఆఫీస్‌‌ ప్రారంభించాడు. కాల్‌‌సెంటర్ ఏర్పాటు చేసి.. మేనేజర్లుగా తన ఫ్రెండ్స్‌‌ కొత్తల్ల మహేశ్, రెడ్డివారి హరిబాబు, టీమ్ లీడర్స్‌‌గా కొర్రు అజిత్‌‌, మడిగ దివాకర్‌‌ ను నియమించాడు. 38 మందికి పైగా యువతులను టెలీకాలర్స్‌‌గా రిక్రూట్ చేసుకున్నాడు. ఆన్‌‌లైన్‌‌లో డీమ్యాట్‌‌ అకౌంట్ హోల్డర్ల డేటా కొనుగోలు చేశాడు. షేర్ మార్కెట్‌‌ ట్రేడింగ్ టిప్స్‌‌పై టెలీకాలర్స్‌‌కి ట్రైనింగ్ ఇచ్చాడు. వాళ్లతో డీమ్యాట్ అకౌంట్ హోల్డర్లకు ఫోన్లు చేయించేవాడు. 

140 మంది బాధితులు..  

డీమ్యాట్ అకౌంట్‌‌ హోల్డర్లకు టెలీకాలర్స్ ఫోన్లు చేసి.. తాము షేర్ మార్కెట్‌‌ ట్రేడింగ్ టిప్స్‌‌ ఇస్తామని నమ్మించేవారు. తామే ఆన్ లైన్ లో ట్రేడింగ్ చేసి లాభాలు ఇస్తామని డబ్బులు కలెక్ట్ చేసేవారు. ఆ తర్వాత ప్రాఫిట్స్ ఇవ్వాలని అడిగినోళ్ల ఫోన్ నంబర్లు బ్లాక్ లిస్టులో పెట్టేవారు. ఇలా 8 నెలల్లో 140 మంది బాధితుల నుంచి రూ.1.8 కోట్లు కొల్లగొట్టారు. పీలేరులోని కాల్‌‌సెంటర్‌‌‌‌పై దాడి చేసిన పోలీసులు.. 31 ల్యాప్‌‌లాప్స్‌‌, ఐదు బ్యాంక్ అకౌంట్స్‌‌ సీజ్ చేశారు. బెంగళూరులో ఉంటున్న సాయి సరన్ కుమార్‌‌ రెడ్డి‌‌తో పాటు మహేశ్, హరిబాబు, అజిత్‌‌, దివాకర్‌‌ ను అరెస్ట్ చేశారు. కాల్‌‌సెంటర్‌‌‌‌లో పని చేస్తున్న 38 మంది టెలీకాలర్స్‌‌కి నోటీసులు జారీ చేశారు.