తోడేలు వేషం కోసం రూ.18 లక్షలు పెట్టిండు

తోడేలు వేషం కోసం రూ.18 లక్షలు పెట్టిండు

ప్రపంచంలో కొంతమందికి వింత వింత కోరికలు ఉంటయ్. అప్పట్ల ఒకాయన కుక్కలాగా కనిపించేందుకు రూ.12 లక్షలు ఖర్చు పెట్టి డ్రెస్ తయారు చేయించుకుంటే.. ఇప్పుడు మరొకాయన తోడేలులాగా కనిపించేందుకు ఏకంగా రూ.18.5 లక్షలు ఖర్చు పెట్టిండు. ఇందుకోసం ప్రత్యేకంగా డ్రెస్ తయారు చేయించుకుండు. జపాన్ కు చెందిన ఒకాయనకు చిన్నప్పటి నుంచి జంతువులంటే బాగా ఇష్టం. టీవీలో చూసినప్పుడల్లా వాటిలాగా తానూ మారాలని అనుకునేటోడు.

ఇగ తన కలను నిజం చేసుకోవాలని జంతువుల లెక్కుండే డ్రెస్సులను తయారు చేసే జెప్పెట్ కంపెనీ దగ్గరికి పోయిండు. తోడేలు వెనుక కాళ్ల మీద నిల్చుంటే ఎట్లుంటదో.. అట్లనే తానుండాలని, అసొంటి కాస్ట్యూమ్ కావాలని అడిగిండు. ‘‘తోడేలు ఫొటోలను చాలాసార్లు పరిశీలించాం. అది నిల్చుంటే ఎట్లుంటదో అట్లనే కాస్ట్యూమ్ తయారు చేశాం. ఇందుకు 50 రోజులు పట్టింది” అని కంపెనీ తెలిపింది. ‘‘చివరికి నా కల నెరవేరింది. కాస్ట్యూమ్ నేను అనుకున్నట్టు కుదిరింది. డిజైనర్లు చాలా కష్టపడ్డారు. వెంటిలేషన్ వచ్చేలా ఏర్పాట్లు కూడా చేశారు” అని కస్టమర్​ చెప్పిండు.