బైక్ ను ఢీకొట్టిన కారు..చిన్నారి మృతి..

బైక్ ను ఢీకొట్టిన కారు..చిన్నారి మృతి..

రద్దీ రోడ్డుపై డ్రైవింగ్ నేర్చుకుంటుండగా ఘటన

తుర్కయాంజల్, వెలుగు: రద్దీగా ఉన్న రోడ్డుపై నిర్లక్ష్యంగా కారు డ్రైవింగ్ నేర్చుకుంటూ బైక్​ను ఢీ కొట్టడంతో 18 నెలల పసిపాప చనిపోయింది. శుక్రవారం ఉదయం ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాదం జరిగింది. పోలీసులు, ప్రత్యేక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా పెనుపక గ్రామానికి చెందిన బోనం హనుమారెడ్డి టీసీఎస్ లో ఉద్యోగం చేస్తూ రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ లో ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం పాలప్యాకెట్ కోసం తన పల్సర్ బైక్​పై కూతురు గగన(18 నెలలు)ను తీసుకుని మెయిన్ రోడ్డుకు సమీపంలో ఉన్న కిరాణా షాపుకు వెళ్లాడు. అదే సమయంలో కమ్మగూడలో నివాసం ఉంటున్న ఇనుగంటి వెంకటరమణ తన భార్య లతకు రద్దీగా ఉండే రోడ్డుపై కారు(ఏపీ24హెచ్​1515) నేర్పుతున్నాడు. వెంకటరమణ కారు షాపు నుంచి తిరిగి వస్తున్న హనుమారెడ్డి బైక్​ను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గగన బైక్​ పై నుండి పడిపోగా.. ఆమెపై నుంచి కారు వెళ్లిపోయింది. హనుమారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించగా అప్పటికే గగన చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. కారు నడిపిన లతపై ఆదిబట్ల పోలీసులు ఐపీసీ 337, 304ఏ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గగన డెడ్​బాడీకి పోస్టుమార్టం చేసిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు.