కేసీఆర్పై తిరుగుబాటు..18 మంది బీఆర్ఎస్ సర్పంచుల రాజీనామా

కేసీఆర్పై తిరుగుబాటు..18 మంది బీఆర్ఎస్ సర్పంచుల రాజీనామా

కేసీఆర్ పై బీఆర్ఎస్ సర్పంచులు తిరగబడుతున్నరు. కేంద్ర నిధులను కేసీఆర్ సర్కారు దారి మళ్లిస్తోందని వారం రోజులుగా ఆందోళన చేపట్టిన సర్పంచులు ఇప్పుడు కేసీఆర్ పై తిరుగుబాటు చేస్తున్నారు. నిధులు దారి మళ్లింపును నిరసిస్తూ రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని 18 మంది బీఆర్ఎస్ సర్పంచులు పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం తమకు తెలియకుండానే మళ్లిస్తున్నారని .. ఏజెన్సీ ప్రాంతంలో కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జడ్పీ ఛైర్మన్ కోవలక్ష్మి ఆదివాసీ సర్పంచులను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. 

ఎంపీడీవో ఆఫీస్ ముందు సర్పంచుల ఆందోళన

కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన 15వ ఆర్థిక సంఘం నిధులను.. అధికారులు తమకు తెలియకుండా దారిమళ్లిస్తున్నారని ఆరోపిస్తూ సోమవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలానికి చెందిన బీఆర్ఎస్ సర్పంచులు ఎంపీడీవో ఆఫీసు ఎదుట ధర్నా చేశారు. డిజిటల్‌ సంతకాలు ఫోర్జరీ చేసి 15వ ఆర్థిక సంఘం నిధులు దారి మళ్లించిన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ.. హుజూరాబాద్‌ ఠాణాలో అదే మండలం చెల్పూర్‌ సర్పంచ్‌ మహేందర్ ఫిర్యాదు చేశారు. మండల పంచాయతీ అధికారి వేముల సురేందర్, పంచాయతీ కార్యదర్శి మేకల రాజేందర్‌ తమ డిజిటల్‌ సంతకాలు ఫోర్జరీ చేసి డబ్బులు డ్రా చేశారని కంప్లైంట్​లో పేర్కొన్నారు. వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవడంతో పాటు డిజిటల్‌ కీని తమకు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.