అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి : కలెక్టర్ నారాయణరెడ్డి

అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి : కలెక్టర్ నారాయణరెడ్డి
  •   అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి
  •   నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి
  •   ఓటరు నమోదుపై ఆఫీసర్లతో సమీక్ష

నిజామాబాద్, వెలుగు: 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని నిజామాబాద్‌ కలెక్టర్‌‌ సి.నారాయణరెడ్డి ఆఫీసర్లకు సూచించారు. పాత జాబితాలో పేర్లను తొలగించే ముందు కారణాలు పక్కాగా  నిర్ధారించుకోవాలన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నీలేశ్‌ వ్యాస్ జిల్లా కలెక్టర్లతో శుక్రవారం కొత్త ఓటర్ల నమోదు, జాబితాలో మార్పులు, చేర్పులు తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అనంతరం జిల్లా ఆఫీసర్లతో కలెక్టర్ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 ఏళ్లు ఆపై వయస్సు ఉన్న యువతను ఓటరు జాబితాలో చేర్చేందుకు జిల్లాలోని అన్ని కాలేజీల్లో విస్తృత స్థాయిలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ఓటరు జాబితాలో తప్పుడు పేర్లు లేకుండా పరిశీలన జరపాలన్నారు. అదే సమయంలో అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి మిస్ కాకుండా చూడాలని సూచించారు. 

ఎవరైనా ఇతర ప్రాంతానికి వలస వెళ్లినట్లయితే ఆ ప్రదేశంలోని ఏదైనా పోలింగ్ బూత్‌లో పేరును నమోదు చేసుకున్నారా అని నిర్ధారించిన తర్వాతే ఇక్కడి జాబితా నుంచి తొలగించాలని తెలిపారు. మృతి చెందిన వారి పేర్లను కూడా పక్కాగా పరిశీలించిన తర్వాతే తీసివేయాలన్నారు. 8 నుంచి 29 ఏళ్ల మధ్య వయ స్సు కలిగిన ఓటర్ల సంఖ్యను నిర్ధారించేందుకు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించాలని ఆదేశించారు. 2003 జనవరి 1 నుంచి 2005 జనవరి1వ తేదీ మధ్యన జన్మించిన వారితో పాటు, 1993 జనవరి 1 నుంచి 2023 జనవరి 1 మధ్యన జన్మించిన స్త్రీలు, పురుషుల వారీగా వేర్వేరుగా వివరాలను సేకరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్లు చిత్రామిశ్రా, చంద్రశేఖర్, జడ్పీ సీఈవో గోవింద్, డీఆర్డీవో చందర్, ఆర్డీవోలు రవి, రాజేశ్వర్, శ్రీనివాస్, ఎన్నికల విభాగం అధికారులు పవన్, సాత్విక్ పాల్గొన్నారు.