190 కిలోల ఎండు గంజాయి స్వాధీనం

190 కిలోల ఎండు గంజాయి స్వాధీనం

సంగారెడ్డి టౌన్, వెలుగు: సంగారెడ్డి– పోతిరెడ్డిపల్లి జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా ఎండు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న రెండు ముఠాలు పట్టుబడ్డాయని ఎస్పీ రూపేశ్​ తెలిపారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ ఈసీఐఎల్ కు చెందిన రాపర్తి సతీశ్, కర్నాటక రాష్ట్రం బీదర్ ప్రాంతానికి చెందిన గణేశ్ ఐదేండ్లుగా వైజాగ్ ప్రాంతం నుంచి హైదరాబాద్ మీదుగా ముంబయి తో పాటు ఇతర ఏరియాలకు గంజాయి తరలిస్తున్నారు.

ఈ క్రమంలో కారులో150 కిలోల గంజాయిని బీదర్ లోని జియా, షబ్బీర్ లకు విక్రయించడానికి తీసుకువెళ్తుండగా పట్టుకున్నారు. అలాగే ముంబయి ప్రాంతంలోని మన్కూర్ కు చెందిన అహ్మద్ మొహమ్మద్ ఆలం, జ్యోతిబో మందిర్ కు చెందిన సచిన్ యాదవ్, మహాత్మా ఫూలే నగర్​కు చెందిన షహీద్ మునీర్ షేక్ కారులో 40 కిలోల ఎండు గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నామని చెప్పారు. ఐదుగురు నిందితులతో పాటు రెండు కార్లను, రూ.కోటి విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకొని దర్యాప్తు ప్రారంభించామని ఎస్పీ తెలిపారు.