తెలంగాణలో 19 లక్షల 21 వేల మందికి బీపీ

తెలంగాణలో 19 లక్షల 21 వేల మందికి బీపీ
  • 9.98 లక్షల మందికి షుగర్.. 33 జిల్లాల్లో ఆరోగ్యశాఖ స్క్రీనింగ్    ఆందోళన కలిగిస్తున్న రిజల్ట్స్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీపీ, షుగర్ చాపకింద నీరులా విస్తరిస్తూ ప్రమాదకరంగా తయారవుతున్నాయి. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్‌సీడీ) స్ర్కీనింగ్‌లో భాగంగా రాష్ట్రంలో 30ఏండ్లు దాటిన వారికి ఆరోగ్యశాఖ టెస్టులు నిర్వహిస్తున్నది. టెస్టుల ఫలితాల్లో12 శాతం మందికి బీపీ, 6.6 శాతం మందికి షుగర్ ఉన్నట్టు తేలింది. రాష్ట్రంలో 1.82 కోట్ల మందిని స్క్రీన్ చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. సర్వేలో భాగంగా ఇప్పటిదాకా కోటి 51 లక్షల 23 వేల 906 మందికి టెస్టులు చేశారు. వీరిలో 19 లక్షల 21 వేల 965 మందికి బీపీ, 9 లక్షల 98 వేల 464 మందికి షుగర్ ఉన్నట్టు గుర్తించారు. 

ట్రీట్‌మెంట్‌పై నిర్లక్ష్యం

బీపీ, షుగర్ బాధితుల్లో 40 శాతం మంది మాత్రమే ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నట్టు తేలింది. మిగిలిన 60 శాతంలో సగం మందికి తమకు బీపీ, షుగర్‌‌ ఉన్నట్టే తెలియదని,  తెలిసినా కొందరు ట్రీట్‌మెంట్ తీసుకోవడం లేదని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం బీపీ, షుగర్ మెడిసిన్ ఉచితంగా పంపిణీ చేస్తున్నా సగం మంది పేషెంట్లు వాటిని తీసుకోవడం లేదు.

ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. ప్రభుత్వం అందరికీ ఒకేరకమైన మెడిసిన్ ఇవ్వడం, రోగానికి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు మార్పులు చేయకపోవడం ప్రధాన కారణాలని డాక్టర్లు చెబుతున్నారు.  అలాగే గుండె, కిడ్నీ జబ్బులు, సీవోపీడీ, క్యాన్సర్ కేసులు కూడా రాష్ట్రంలో  విపరీతంగా పెరుగుతున్నాయి. సమయానికి తినకపోవడం, ఇన్‌స్టంట్ పేరిట ఉప్పు, ఇతర రసాయనాలు కలిపిన ప్యాక్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ తినడం, గాలి కాలుష్యం, పంటల్లో పురుగుమందుల వాడకం, వ్యాయామం చేయకపోవడం, వంటి అనేక కారణాలు ఉన్నాయని డాక్టర్లు వివరిస్తున్నారు. 

ఇలా చేస్తే బెటర్!

లైఫ్ స్టయిల్ డిసీజ్‌ల నుంచి జనాన్ని కాపాడాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్పులు రావాలి. హెల్త్ ఎడ్యుకేషన్‌ను మెరుగు పరచాలి. పార్కుల సంఖ్య పెంచి, స్వచ్ఛమైన గాలి పీల్చుకునే అవకాశం ఇవ్వాలి. కాలుష్య నియంత్రణకు, పంటల్లో పురుగుమందుల వాడకాన్ని తగ్గించేందుకు ప్రణాళికలు అమలు చేయాలి. తిండి, నీళ్లు, పాలు, ఇతర ఆహార పదార్థాలు కల్తీ కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలి.

ఇప్పుడున్న పరిస్థితుల్లో పర్సనల్ లైఫ్ బాగా తగ్గిపోయింది. 8 గంటల పని రూల్ అమలు కావట్లేదు. శారీరక శ్రమ ఉండడం లేదు. చాలామంది యువతకు బీపీ, షుగర్ రావడానికి ఇదే కారణం. అది తగ్గాలంటే పని గంటల రూల్ కచ్చితంగా అమలయ్యేలా చూడాలి. పని వాతావరణం మారాలి. ఎవరికివారు తమ ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండాలి. వ్యాయమం చేయాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

ప్యాక్డ్‌ ఫుడ్ పక్కనబెట్టాలి

బీపీ, షుగర్ ఉండడానికి లైఫ్‌ స్టయిల్‌లో వచ్చిన మార్పులే కారణం. ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది. ఆహారపు అలవాట్లలో మార్పులొచ్చాయి. ప్రతి ఇంట్లోనూ ఇన్‌స్టంట్ ప్యాక్డ్ ఫుడ్ అలవాట్లు వచ్చేశాయి. ప్రపంచంలోని ఏ దేశంలోనైనా బీపీ, షుగర్ రావడానికి ఇవే ప్రధాన కారణాలు. వీటిని మార్చుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవాలి. ప్యాక్డ్ ఫుడ్ పక్కన పెట్టాలి. 
- డాక్టర్ విజయేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,  బసవతారకం హాస్పిటల్