- డ్రంక్ అండ్డ్రైవ్ టెస్టుల్లో పట్టుబడితే కేసులు
- ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు సీజ్
- స్పీడ్ కంట్రోల్ చేసేందుకు ‘గన్స్’
కామారెడ్డి, వెలుగు: ఇటీవల హైవేలపై యాక్సిడెంట్లు పెరగడం.. మరణాలు ఎక్కువ కావడంతో అధికారులు అలెర్ట్ అయ్యారు. జిల్లా పరిధిలోని హైవేల మీద యాక్సిడెంట్లను నివారించడంపై ఫోకస్ పెట్టారు. రాంగ్రూట్లో వాహనాలు నడపడం, ఓవర్ స్పీడ్, డ్రంక్‌అండ్‌డ్రైవ్ వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. నెల రోజుల కింద ఓ టిప్పర్ రాంగ్రూట్లో వచ్చి స్ర్కూటీని ఢీ కొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోయారు.
శనివారం రాత్రి ఆదిలాబాద్ నుంచి బెంగుళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్బస్సు భిక్కనూరు దగ్గర అతివేగంగా వచ్చి ప్రమాదాలను నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన డ్రమ్ములను ఢీ కొట్టింది. డ్రైవర్‌కు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేయగా అతడు మద్యం తాగినట్టు తేలింది. బస్సులో ఉన్న 30 మంది ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు.
వారిని పోలీసులు వేరే బస్సులో పంపారు.
జిల్లా మీదుగా 2 నేషనల్హైవేలు వెళ్తున్నాయి. 44 వ నెంబర్హైవే 50 కిలోమీటర్ల మేరకు ఉండగా.. సంగారెడ్డి,- అకోలా, నాందేడ్హైవే 60 కిలోమీటర్లు ఉంది. ఈ మార్గాల్లో రోజూ వేలాది వెహికల్స్ తిరుగుతుంటాయి. జిల్లాలో ప్రమాదాల నియంత్రణకు యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. హైవేలపై రాత్రిపూట వెహికల్ చెకింగ్ విస్తృతం చేశారు. దూర ప్రాంతాలకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల డ్రైవర్లకు బ్రీత్ఎనలైజర్ టెస్ట్‌లు చేస్తున్నారు. పాజిటివ్ వచ్చిన డ్రైవర్లపై కేసులు పెడుతున్నారు.
10 రోజుల్లో 2 ప్రైవేట్ బస్సులను సీజ్ చేసిన పోలీసులు.. ప్రయాణీకులను వేరే బస్సుల్లో గమ్యస్థానాలకు చేర్చారు. లారీలు, కార్లు ఇతర వెహికల్స్‌ను కూడా తనిఖీ చేస్తూ మద్యం తాగి డ్రైవింగ్ చేసినట్టు తేలితే కేసులు నమోదు చేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో కోర్టులు జరిమానాలతో పాటు జైలు శిక్షలు కూడా విధిస్తున్నాయి. ఓవర్ స్పీడ్ నియంత్రణ కోసం హైవేలపై రెండు చోట్ల స్పీడ్ గన్స్ ఏర్పాటు చేశారు.తరచూ ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి నివారణ చర్యలు చేపడుతున్నారు.
జిల్లా పరిధిలో జరిగిన యాక్సిడెంట్లలో నిరుడు 270 మంది చనిపోయారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 176 మంది చనిపోయారు. వందలాది మంది గాయపడ్డారు. ఈ ప్రమాదాల్లో దాదాపు సగం హైవేలపై జరిగినవే.
ఈ నెల 6న రాత్రి భిక్కనూరు టోల్‌ప్లాజా వద్ద 1,139 వెహికల్స్ తనిఖీలు చేయగా ఇందులో 27 మంది డ్రైవర్లు మద్యం తాగినట్టు గుర్తించి కేసులు నమోదు చేశారు. రాత్రి పూట నాగ్‌పూర్, హైదరాబాద్‌ల మధ్య నడిచే బస్సుల డ్రైవర్లు కూడా మద్యం తాగినట్టు తేలడంతో ప్రయాణీకులు ఆందోళన చెందుతున్నారు.
భద్రతకే పెద్దపీట
ప్రయాణీకుల భద్రతకే ప్రాధాన్యం ఇస్తున్నాం. ప్రమాదాల నివారణకు విస్తృతంగా వెహికల్స్తనిఖీలు చేస్తున్నాం. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నాం. పలువురు మద్యం తాగి వెహికల్స్ నడుపుతున్నట్టు గుర్తించాం. వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్లు మద్యం తాగినట్టు అనుమానం ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. - రాజేష్ చంద్ర, ఎస్పీ,- కామారెడ్డి
