
- మరో టెర్రరిస్టును కూడాతుదముట్టించిన బలగాలు
- ఇద్దరు జవాన్లకు గాయాలు
- కెప్టెన్ శుభం మృతి పట్ల యూపీ సీఎం యోగి సంతాపం
రాజౌరీ: జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో భద్రతా బలగాలు, టెర్రరిస్టులకు మధ్య రెండో రోజు గురువారం కూడా కాల్పులు కొనసాగాయి. భద్రతా బలగాలు ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టాయి. ఇద్దరు సోల్జర్లు గాయపడ్డారు. ఈ ఎన్ కౌంటర్లో బుధవారం నలుగురు సైనికులు చనిపోగా బుల్లెట్ గాయాలతో ఆస్పత్రిలో చేరిన మరో సైనికుడు గురువారం కన్నుమూశాడు. వీరమరణం పొందిన వారిలో ఇద్దరు ఆఫీసర్లు కెప్టెన్ ఎంవీ ప్రాంజల్, కెప్టెన్ శుభం గుప్తాలతో పాటు మరో ముగ్గురు సోల్జర్లు.. హవల్దార్ అబ్దుల్ మజీద్, లాన్స్ నాయక్ సంజయ్ బిష్త్, పారాట్రూపర్ సచిన్ లౌర్ ఉన్నట్లు ఆర్మీ ఉన్నతాధికారులు ప్రకటించారు. యూపీకి చెందిన కెప్టెన్ శుభం గుప్తా మృతికి సీఎం యోగి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించారు.
ఇద్దరు టెర్రరిస్టుల కాల్చివేత..
బాజిమార్ ఏరియాలోని కాలకోట్ అడవుల్లో రెండో రోజు కొనసాగిన కాల్పుల్లో లష్కరే తాయిబా(పాకిస్తాన్)కు చెందిన టాప్ కమాండర్ క్వారీతో పాటు మరో టెర్రరిస్టును భద్రతా దళాలు హతమార్చాయి. డాంగ్రీ, కాండి దాడులకు క్వారీనే సూత్రధారి అని భావిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. రాజౌరీలో మళ్లీ టెర్రరిజాన్ని బలోపేతం చేసే బాధ్యతను లష్కరే తాయిబా క్వారీకి అప్పగించినట్లు తమకు సమాచారం ఉందన్నారు. కాగా, గాయపడిన మరో మేజర్, జవాన్‌కు ఉధంపూర్‌లోని ఆర్మీ కమాండ్ హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చివరి దశకు చేరుకుందని పేర్కొన్నారు.