ఔసనేశ్వర్ మహాదేవ్ ఆలయంలో తొక్కిసలాట.. ఇద్దరు భక్తులు మృతి.. 40 మందికి గాయాలు

ఔసనేశ్వర్ మహాదేవ్ ఆలయంలో తొక్కిసలాట.. ఇద్దరు భక్తులు మృతి.. 40 మందికి గాయాలు

లక్నో: ఉత్తరప్రదేశ్ బారాబంకిలోని ఔసనేశ్వర్ మహాదేవ్ ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు భక్తులు మృతి చెందగా.. 40 మందికి పైగా గాయపడ్డారు. శ్రావణ సోమవారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున ఔసనేశ్వర్ మహాదేవ్ ఆలయానికి తరలివెళ్లారు. ఈ క్రమంలో కోతులు గుంపు ఒక్కసారిగా దూకడంతో ఓ విద్యుత్ తీగ తెగి ఆలయంలోని రేకుల షెడ్‎పై పడింది. కొందరు భక్తులు విద్యుత్ ఘాతానికి గురయ్యారు. దీంతో భయాందోళనకు గురైన భక్తులు ఒక్కసారిగా పరుగులు పెట్టడంతో ఆలయంలో తొక్కిసలాట జరిగి ఇద్దరూ భక్తులు మృతి చెందారు. 

మరో 40మందికి పైగా భక్తులు గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఘటన స్థలంలో సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఒకరిని ముబారక్‌పుర గ్రామానికి చెందిన 22 ఏళ్ల ప్రశాంత్‌గా గుర్తించారు పోలీసులు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఆలయంలో జలాభిషేక సమయంలో ఈ దుర్ఘటన జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 

ఈ ఘటనపై జిల్లా మేజిస్ట్రేట్ శశాంక్ త్రిపాఠి మీడియాతో మాట్లాడుతూ.. కోతులు దూకడంతో కరెంట్ వైర్ ఆలయంలోని  షెడ్ పై పడటంతో తొక్కిసలాట జరిగిందని తెలిపారు. తొక్కి సలాటలో ఇద్దరూ మృతి చెందారని.. మరికొందరు గాయపడ్డారని చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని, ఘటన స్థలంలో సహయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందన్నారు. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.