V6 News

మైనర్లతో యూరిన్ తాగించారు... కారం పెట్టారు..

మైనర్లతో యూరిన్  తాగించారు... కారం పెట్టారు..

మధ్యప్రదేశ్‌లో గత నెల ఓ దళితుడిపై ప్రబుద్ధుడు మూత్రం పోసిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనపై ఆ రాష్ట్ర సీఎం సీరియస్‌గానే స్పందించారు. బాధితుడ్ని రప్పించి.. అతడికి పాదపూజ చేసి ఆ నీళ్లు తన నెత్తిని చల్లుకున్నారు సీఎం చౌహన్. తాజాగా, దానికి మించి అత్యంత హేయమైన ఘటన యూపీలో వెలుగుచూసింది. దొంగతనం చేశారని ఆరోపిస్తూ ఇద్దరు మైనర్ బాలుర్ని కట్టి, చిత్రహింసలకు గురి చేశారు.

దొంగతనం చేశారన్న అనుమానంతో ఇద్దరు మైనర్లను పట్టుకున్నారు కొందరు.. ఆ తర్వాత వారి చేత మూత్రం తాగించారు. మలద్వారంలో పచ్చి కారం వేశారు. ఉత్తరప్రదేశ్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. దొంగతనం చేశారనే అనుమానంతో ఇద్దరు మైనర్ బాలుర పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించారు. మూత్రం తాగించి, మలద్వారంలో పచ్చి మిరపకాయలు రుద్ది చిత్రహింసలకు గురిచేశారు. అనంతరం వారికి గుర్తుతెలియని ఇంజెక్షన్లు ఇచ్చారు. యూపీలోని సిద్ధార్థనగర్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాధిత బాలుర వయసు 10, 15 ఏళ్లు ఉంటుంది.

అత్యంత భయానకంగా వారితో పచ్చి మిరపకాయలు తినిపించి, బాటిల్‌లో నింపిన మూత్రం తాగించారు. దాడిలో తీవ్ర అస్వస్థతకు గురై చిన్నారులు.. భయంతో వణికిపోవడం వీడియోలో కనిపిస్తోంది. కొంతమంది వ్యక్తులు వారిని దుర్భాషలాడటం, తాగకపోతే కొడతామని బెదిరించడం వినబడుతోంది. పౌల్ట్రీలో కోళ్లు, డబ్బు దొంగతనం చేశారని ఆరోపిస్తూ ఇద్దర్నీ పట్టుకుని నిందితులు కట్టేశారు.

వారి చేతులను వెనుకకు కట్టి, ప్యాంటు క్రిందికి లాగి నేలపై పడుకోబెట్టారు. ఓ వ్యక్తి వారి మలద్వారంలోకి పచ్చి మిరపకాయలను రుద్దడం, చొప్పించాడు. బాధతో విలవిలలాడుతున్న వారికి పసుపు రంగులో ఉన్న ఓ ద్రవణాన్ని ఇంజెక్ట్ చేశారు. సిద్దార్థనగర్ జిల్లా పత్రా బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంకటి చౌరాహా సమీపంలోని అర్షన్ చికెన్ షాప్‌ సమీపంలో ఆగస్టు 4న ఈ వీడియో చిత్రీకరించినట్టు తెలుస్తోంది.