ఎర్రుపాలెం, వెలుగు: పీఎం కుసుమ్ పథకంలో భాగంగా ప్రైవేట్ వ్యక్తులు నిర్మించిన 2 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్‌ను ఎర్రుపాలెం మండలం వెంకటాపురం 33/11 కేవీ సబ్‌స్టేషన్‌కు విద్యుత్ శాఖ ఆఫీసర్లు గురువారం గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. ఇప్పటికే అనుసంధానమైన 1 మెగావాట్ ప్లాంట్‌తో కలిపి వెంకటాపురం సబ్‌స్టేషన్ పరిధిలో మొత్తం 3 మెగావాట్ల సౌర విద్యుత్ గ్రిడ్‌కు అందుబాటులోకి వచ్చిందని ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలిపారు. సౌర విద్యుత్ ఉత్పత్తి పెరగడం వల్ల స్థానిక విద్యుత్ సరఫరా వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని చెప్పారు. పీఎం కుసుమ్ పథకం కింద ఇప్పటివరకు ఐదు ప్లాంట్ల ద్వారా 11 మెగావాట్ల సౌర విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేసినట్లు తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా 55 ప్లాంట్ల ద్వారా 93.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయని, మరో రెండు మూడు నెలల్లో మిగిలిన ప్లాంట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. తిరుమలాయపాలెం, పెద్దగోపతి, తల్లాడ సబ్‌స్టేషన్ల వద్ద ఒక్కో మెగావాట్ సామర్థ్యంతో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు పనులు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
