20 శాతం తగ్గిన రెసిడెన్షియల్‌‌ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు

20 శాతం తగ్గిన రెసిడెన్షియల్‌‌ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు

జూన్‌తో పోలిస్తే 26 శాతం తక్కువ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: సిటీలో జులైలో రెసిడెన్షియల్‌‌ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు జూన్‌‌ నెలతో పోలిస్తే  20 శాతం మేర తగ్గాయి.  కిందటి నెలలో  4,313 యూనిట్ల రెసిడెన్షియల్ ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లు జరిగాయని  రియల్‌‌ ఎస్టేట్ కన్సల్టింగ్‌‌ కంపెనీ నైట్ ఫ్రాంక్ వెల్లడించింది.  రూ. 50 లక్షల కంటే ఎక్కువ వాల్యూ ఉన్న ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లు కొద్దిగానే జరిగాయని పేర్కొంది. ఆషాడ మాసం సెంటిమెంట్‌‌తో పాటు, వడ్డీ రేట్లు పెరగడం వంటి ఇతర అంశాల వలన  ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లు జులై నెలలో తగ్గాయని వివరించింది. కిందటి నెలలో హైదరాబాద్‌‌లో రూ. 2,101 కోట్ల విలువైన రెసిడెన్షియల్‌‌ ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇది జూన్ నెల తో పోలిస్తే 26 శాతం తక్కువ.

ఈ ఏడాది ప్రారంభం నుంచి చూస్తే ఇప్పటి వరకు 40,897 రెసిడెన్షియల్ యూనిట్ల రిజిస్ట్రేషన్లు సిటీలో జరిగాయి.  వీటి మొత్తం విలువ రూ. 20,023 కోట్లు. కిందటి నెల జరిగిన రెసిడెన్షియల్‌ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లలో రూ. 25–50 లక్షల మధ్య ఉన్న ప్రాపర్టీల వాటా  56 శాతంగా ఉంది. ఈ వాటా కిందటేడాది జులైలో 34 శాతంగా రికార్డయ్యింది. రూ. 25 లక్షల కంటే తక్కువ వాల్యూ ఉన్న ప్రాపర్టీలకు డిమాండ్ తగ్గిందని నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. మొత్తం రిజిస్ట్రేషన్లలో ఈ సెగ్మెంట్ వాటా 35 % నుంచి 18 శాతానికి తగ్గిందని తెలిపింది. రూ. 50 లక్షల కంటే ఎక్కువ వాల్యూ ఉన్న ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లు 31 %  నుంచి 26 శాతానికి తగ్గాయి.