ఫలించిన నారాయణపూర్ రిజర్వాయర్ నిర్వాసితుల ఉద్యమం

 ఫలించిన నారాయణపూర్ రిజర్వాయర్ నిర్వాసితుల ఉద్యమం
  •  ఫలించిన నారాయణపూర్ రిజర్వాయర్ నిర్వాసితుల ఉద్యమం
  • రెండు దశాబ్దాల ఎదురుచూపులకు తెర 
  • మంగపేటలో 86.09 ఎకరాల భూమి,  8 ఇండ్లకు  డిక్లరేషన్ 
  • రాష్ట్రంలో నిర్వాసితులు పొందిన అత్యధిక పరిహారం ఇదే
  • కొండపోచమ్మసాగర్, గౌరవెల్లిలో రూ.15 లక్షలే అత్యధికం

కరీంనగర్, వెలుగు: నారాయణపూర్ రిజర్వాయర్ పరిధిలోని మంగపేట గ్రామ భూనిర్వాసితుల పోరాటం ఫలించింది. రెండు దశాబ్దాల సుదీర్ఘకాలం తర్వాత ఎట్టకేలకు పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. రిజర్వాయర్ అవసరాల కోసం  తీసుకుంటున్న 86.09 ఎకరాల భూమికి భూసేకరణ చట్టం-2013 ప్రకారం పరిహారం..ఇండ్లు కోల్పోయిన 8 కుటుంబాలకు పరిహారం, ఉపాధి, పునరావాస ప్రయోజనాలు కల్పించేందుకు ప్రభుత్వం తాజాగా డిక్లరేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం రిజర్వాయర్ కోసం సేకరించిన భూముల మార్కెట్ వాల్యూ ధరణి (జాయింట్ సబ్ రిజిస్ట్రార్) రికార్డుల ప్రకారం..ఎకరాకు రూ.6,75,000గా చూపిస్తోంది.

కానీ, ఇప్పుడు భూసేకరణ చట్టం ప్రకారం..ఎకరాకు రూ.20.25 లక్షల పరిహారం రైతులకు అందనుంది. గతంలో కోర్టుకు వెళ్లిన కొండపోచమ్మసాగర్, గౌరవెల్లి రిజర్వాయర్ భూనిర్వాసితుల్లో కొందరికి అత్యధికంగా రూ.15 లక్షల పరిహారం ఇచ్చారు. ఇప్పుడు చట్టం ప్రకారం మూడు రెట్లు పరిహారం ఇస్తే  ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిధిలో మంగపేట రైతులు తీసుకున్న పరిహారమే అత్యధికం కానుంది. 

రెండు దశాబ్దాలుగా ఎదురుచూపులు.. 

కరీంనగర్​ జిల్లా గంగాధర మండలంలోని 46 గ్రామాలు, ప్రస్తుత కొత్తపల్లి మండలంలోని 3 గ్రామాల ప్రజలకు తాగునీరందించేందుకు 1999లో అప్పటి ఎమ్మెల్యే న్యాలకొండ రాంకిషన్ రావు ఆధ్వర్యంలో గంగాధర చెరువును మంచినీటి ప్రాజెక్టుగా మార్చారు. కాంగ్రెస్ హయాంలో అప్పటి ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణగౌడ్ చొరవతో వైఎస్సార్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఇరిగేషన్ పరిధిలోకి తీసుకొచ్చి 1.50 లక్షల ఎకరాల సాగు లక్ష్యంగా నారాయణపూర్ రిజర్వాయర్ గా మార్చింది. ఇందులోభాగంగా ఎల్లమ్మ చెరువు, నారాయణపూర్ గ్రామ చెరువు, చర్లపల్లి (ఎన్) పరిధిలోని గబ్బిలాల చెరువులను కలిపేశారు. దీంతో నారాయణపూర్, చర్లపల్లి (ఎన్), మంగపేట గ్రామాల్లో కలిపి 240 ఎకరాల వ్యవసాయ భూములు, నారాయణపూర్ లో 25 ఇండ్లు, మంగపేటలో 11 ఇండ్లు, చర్లపల్లిలో కొన్ని ఇండ్లు ముంపునకు గురవుతున్నట్లు అప్పట్లో అధికారులు గుర్తించారు.

ఈ ఇండ్లకు ఇప్పటి వరకు పరిహారం అందలేదు. మంగపేటలో 87.16 ఎకరాల సాగుభూమి, 40 వ్యవసాయ బావులు, 11 ఇండ్లకు ఐదేండ్ల క్రితం అవార్డు ఎంక్వైరీ జరిగింది. దీనికి సంబంధించి భూనిర్వాసితులు సంతకాలు చేసినా పరిహారం అందలేదు. దీంతో ఐదేండ్లుగా రైతులు తరచూ ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే మరోసారి ఈ ఏడాది జనవరి 23న గ్రామసభను, ఏప్రిల్ 15న ప్రజాభిప్రాయ సేకరణను చేపట్టిన అధికారులు.. చివరిగా ఈ నెల 10న ఫైనల్ గా డిక్లరేషన్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నెలాఖరు వరకు నిర్వాసితుల పేరిట పరిహారానికి సంబంధించిన అవార్డ్ పాస్ చేయనున్నారు. ఐదేండ్ల క్రితం ఇలాగే నిర్వాసితుల సంతకాలు తీసుకుని పరిహారం ఇవ్వలేదని, ఈ సారైనా నాన్చకుండా త్వరగా డబ్బులు చెల్లించాలని  రైతుల వేడుకుంటున్నారు. 

ఇండ్లు కోల్పోతున్న వాళ్లకు పరిహారం ఎప్పుడో ? 

నారాయణపూర్ రిజర్వాయర్ పరిధిలోని ఎల్లమ్మ చెరువు కింద గంగాధర, మంగపేట గ్రామాలు, నారాయణపూర్, గబ్బిలాల చెరువుల కింద నారాయణపూర్, చర్లపల్లి(ఎన్), ఇస్తారిపల్లి ఉన్నాయి. నిరుడు జూలైలో కురిసిన భారీ వర్షాలతో ఈ గ్రామాల్లోకి వరదనీరు భారీగా చేరడంతో ప్రజలు పాట్లు పడ్డారు. నారాయణపూర్ చెరువు పూర్తి సామర్థ్యానికి చేరి కట్ట తెగే పరిస్థితికి చేరడంతో రాత్రికి రాత్రి ఇస్తారుపల్లిలోని 40 కుటుంబాలు, నారాయణపూర్ లోని 10 కుటుంబాలను గంగాధరలోని ఓ ప్రైవేట్ స్కూల్​లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. తమను పునరావాస కేంద్రానికి తరలించి చేతులు దులుపుకున్నారే తప్పా.. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

మూడింతల పరిహారానికి ఓకే చెప్పినం

మా గ్రామంలో సుమారు 87 ఎకరాల భూమి నారాయణపూర్ రిజర్వాయర్ లో ముంపునకు గురవుతోంది.  పరిహారం కోసం ఏండ్లుగా అడుగుతున్నం. మా గ్రామ ప్రజలు, రైతులకు భూ సేకరణ అధికారులు మార్కెట్ వాల్యూ కన్నా మూడింతల పరిహారం ఎక్కువ ఇస్తామంటే గ్రామస్తులందరం ఒప్పుకున్నాం. ఇప్పటికే చాలా ఏండ్లుగా రైతులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైనా పరిహారాన్ని త్వరగా అందించాలి. -  తోట వేదాంతి, సర్పంచ్​, మంగపేట