
ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమ అంటూ 20 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన చిత్రం 'జయం'. హీరో నితిన్ తొలిసారి కథానాయకుడిగా ఈ సినిమాతోనే టాలీవుడ్ కు పరిచయమయ్యాడు. డైరెక్టర్ తేజ దర్శకత్వం వహించిన ఈ మూవీలో నితిన్ సరసన సదా కనిపించగా.. గోపీచంద్ విలన్ పాత్ర పోషించాడు. లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లోనే రూ. 18కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. 2002 జూన్ 14న విడుదలైన జయం సినిమా నేటితో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
సుదర్శన్ థియేటర్లో నువ్వు నేను అందరితో కలిసి సినిమాని చూస్తున్న డైరెక్టర్ తేజకు సినిమా హాల్లో కనిపించిన ఓ కుర్రాడు భలే నచ్చాడు. ఎవరని ఆరా తీయగా ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి కొడుకు అని తెలిసింది. నితిన్ ను కలిసిన తేజ నిన్ను హీరోని చేస్తా.. ఇంట్రెస్ట్ ఉంటే ఆఫీస్ కు వచ్చి కలువమని ఆఫర్ చేశాడు. ముందు షాకైన నితిన్.. నాలుగైదు రోజుల తర్వాత తేజను కలిశాడు. తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ డైలాగ్, స్టెప్స్ వేసి చూపించాడు. అప్పటికి నితిన్ వయసు18 ఏళ్లు.
నిజానికి జయం మూవీతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను హీరోగా లాంఛ్ చేయాలని తేజ అనుకున్నాడు. కానీ లుక్ టెస్ట్ చేసి డ్రాప్ అయ్యాడు. అ తర్వాత నితిన్ ను ఫైనల్ చేశాడు. హీరోయిన్ గా సదా, విలన్ గా ముంబైకి చెందిన నటున్ని తీసుకున్నారు. ముందుగా సాంగ్స్ షూట్ చేసి ఆ తర్వాత టాకీ పార్ట్ షూటింగ్ మొదలుపెట్టారు. అయితే విలన్ యాక్టింగ్ నచ్చకపోవడంతో తేజకు గతంలో అవకాశం కోసం తన దగ్గరకు వచ్చిన గోపీ చంద్ గుర్తొచ్చాడు. దీంతో జయంలో విలన్ మారిపోయాడు.
తొలి వలుపు సినిమా ప్లాప్ కావడంతో హీరోగా కాదు.. ముందునటుడిగా నిరూపించుకోవాలని డిసైడైన గోపీచంద్ జయం మూవీలో క్యారెక్టర్ ను ఛాలెంజింగ్గా తీసుకున్నాడు. షూటింగ్ లో అతని యాక్టింగ్ చూసి షాకైన తేజ .. ఈ సినిమా తర్వాత నీ క్రేజ్ ఓ రేంజ్ కు చేరుతుందని చెప్పాడట. నితిన్, సదా, గోపీచంద్ లకు మూవీ రెమ్యూనరేషన్ గా రూ. 10,000 ఇచ్చాడు తేజ. 65 రోజులలో షూటింగ్ కంప్లీట్ పూర్తి చేసి సొంతంగా రిలీజ్ చేశాడు. రొటిన్ స్టోరీకి కొత్త రకం స్ర్కీన్ ప్లే జోడించి హిట్ కొట్టాడు. ఆర్పీ సాంగ్స్ సినిమాకి ప్రాణం పోశాయి.
18 కోట్లు పైగా షేర్ వసూళ్లను సాధించిన జయం మూవీని తమిళ్ లో ఇదే పేరుతో రీమేక్ చేయగా అక్కడ కూడా సూపర్ హిట్టైంది. ఈ సినిమాకుగాను నితిన్ కు ఫిలింఫేర్ అవార్డు రాగా గోపీచంద్ ను నంది అవార్డు వరించింది. ఇక్కడో ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మూవీలో నితిన్ కు హీరో శివాజీ, సదాకి సింగర్ సునీత డబ్బింగ్ చెప్పారు. సునీతకు డబ్బింగ్ విభాగంలో నంది అవార్డు లభించింది.
జయం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హీరో నితిన్.. సినీ కెరీర్ లో 20 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. తేజ దర్శకత్వంలో టీనేజీలోనే మొదటి సినిమాతో హిట్ కొట్టి తానేంటో నిరూపించుకున్నాడు. కుర్రాడు లేతగా ఉన్నాడన్న వారికి నెక్స్ట్ సినిమాలో తనలోని మాస్ హీరోను చూపించాడు. సై, టక్కరి, ఇష్క్, భీష్మ, గుండెజారి గల్లంతయ్యిందే, హార్ట్ ఎటాక్, మాస్ట్రో ఇలా వరుస సినిమాలు చేసి అభిమానులకు దగ్గరయ్యాడు. కెరీర్ ఆరంభంలో హిట్ల కొట్టిన నితిన్ ఆ ఒరవడి కంటిన్యూ చేయలేకపోయాడు. సంబరం, శ్రీ అంజనేయం సినిమాలతో పరాజయాలను మూటగట్టుకున్నాడు. ఆ తర్వాత రాజమౌళితో సై సినిమా చేసి మళ్లీ ట్రాక్ లో పడ్డాడు అనుకునేలోపే విజయాలు దోబూచులాడాయి. సై తర్వాత వచ్చిన అల్లరి బుల్లోడు నుంచి వరుసగా 12 అపజయాలను చవిచూశాడు. ఇక నితిన్ కెరీర్ ఖతం అనుకుంటున్న సమయంలో విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఇష్క్ సినిమా మళ్లీ నితిన్ ను నిలబెట్టింది. ఆ తర్వాత గుండెజారి గల్లంతయ్యిందే, హార్ట్ ఎటాక్ సినిమాలతో మరో రెండు హిట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన.. అ ఆ మూవీ నితిన్ మార్కెట్ అమాంతం పెంచేసింది. బాక్సాఫీసు దగ్గర యాభై కోట్లు రాబట్టింది.
అఆ హిట్ తర్వాత.. లై, ఛల్ మోహన రంగా, శ్రీనివాస కళ్యాణం హ్యాట్రిక్ ఫ్లాప్ లు మూట గట్టుకున్నాడు. ఈ సారి కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని ఫిక్సై... చెక్ లాంటి డిఫరెంట్ సబ్జెక్ట్.. భీష్మ వంటి యూత్ ఫుల్ స్టోరీని ఎంచుకున్నాడు. వీటిలో భీష్మ హిట్ కొట్టింది. అంధాదూన్ రీమేక్ గా ఈ యువ కథానాయకుడు చేసిన మాస్ట్రో.. డైరెక్ట్గా ఓటీటీలో విడుదలైనప్పటికీ నితిన్ అభిమానుల్ని ఆకట్టుకుంది. త్వరలోనే మాచర్ల నియోజక వర్గం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న నితిన్.. జయం సినిమాతో తనను హీరోగా పరిచయం చేసిన డైరెక్టర్ తేజతో పాటు ఇప్పటి వరకు తనతో వర్క్ చేసిన వారందరికీ, అభిమానులకు ట్విట్టర్ వేదికగా థాంక్స్ చెప్పాడు. సినీ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసి నిలదొక్కుకున్న నితిన్ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిద్దాం.