కూలీల బతుకులకు భరోసా ఏది?

కూలీల బతుకులకు భరోసా ఏది?

తెలంగాణలో 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర గ్రామీణ జనాభాలో 31 లక్షల మంది సాగుదారులు ఉండగా, 60 లక్షల మంది వ్యవసాయ కూలీలుగా నమోదయ్యారు. పశుపోషకులు, మేకలు, గొర్రెల పెంపకందారులు, కల్లు గీత పని వారు, మత్స్య కారులు, చేనేత కార్మికులు, చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి వృత్తుల్లో ఉన్న శ్రమ జీవులు గ్రామీణ జనాభాలో మరో భాగం. కొన్నిప్రత్యేక  వృత్తుల్లో ఉన్న వారు తప్ప, అందరూ శారీరక శ్రమ చేసే  జీవనోపాధిలో ఉన్న వాళ్లే. అసలు భూమి లేని గ్రామీణ పేదలు, సన్న, చిన్న కారు రైతులు ప్రధానంగా మధ్య వయస్కులు వ్యవసాయ కూలీ పనులకు వెళుతున్నారు. భూమి లేని పేదల్లో అత్యధికులు దళిత, వెనుకబడిన వర్గాల  కుటుంబాలకు చెందిన వారే. ఇప్పటికీ గ్రామీణ తెలంగాణలో కొన్ని జిల్లాల్లో మహిళా బీడీ కార్మికుల సంఖ్య ఎక్కువగానే ఉంది.

కుటుంబ అవసరాలను బట్టి వ్యవసాయ సీజన్ లో వీళ్లు కూడా పొలం పనులకు కూలీకి వెళుతున్నారు. రోడ్లు, భవనాల నిర్మాణం, హమాలీ రంగాల కార్మికులుగా, ఆటో, లారీ, ట్రాక్టర్ డ్రైవర్లుగా, క్లీనర్లుగా చాలా మంది స్థానికంగా లేదా దగ్గరలోని నగరాలకు వెళ్లి జీవనోపాధి పొందుతున్నారు. కొంతమంది పూర్తిగా నగరాలకు వలస వెళ్లి, అడ్డా కూలీలుగా, వాచ్ మెన్ లుగా జీవనం సాగిస్తున్నారు. ఈ కుటుంబాల మహిళలు అత్యధికంగా నగరాల్లో, పట్టణాల్లో గృహ కార్మికులుగా పని చేసుకుంటున్నారు. 2021లో జనాభా లెక్కల ప్రక్రియ కొనసాగి ఉంటే, తెలంగాణ గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవనోపాధిలో వచ్చిన మార్పులు స్పష్టంగా కనపడి ఉండేవి. కరోనా కారణంగా ఆ ప్రక్రియ జరగలేదు.  

వలస కూలీల రాకతో..

పంటల సాగులో తగిన ఆదాయాలు లేకపోవడం, వ్యవసాయ రంగంలో కూడా కూలీ రేట్లు చాలా కాలం పాటు పెరగకుండా స్తంభించిపోవడం, కుటుంబాల జీవన వ్యయం పెరిగిపోవడం, ఆధిపత్య కులాలు చూపించే అహంభావం, దౌర్జన్యం, కుల వివక్షను  సహించకూడదనే చైతన్యం పెరగడం చూస్తున్నాం. ఎంతో కొంత కొత్త తరానికి అందుబాటులోకి వచ్చిన చదువులు, బయట నుంచి బలవంతంగా రుద్దిన వినియోగదారీ సంస్కృతి ప్రభావం వల్ల బండ చాకిరీతో కూడిన శారీరక శ్రమ పట్ల విముఖత పెరగడం లాంటి కొన్ని కారణాలు గ్రామీణ జీవనోపాధి రంగంలో తీవ్ర మార్పులకు కారణమవుతున్నాయి. ఇదే సమయంలో పంటల పొందికలో తీవ్రమైన మార్పులు వచ్చాయి. అందరికీ ఒకే సారి కూలీల అవసరం ఏర్పడుతున్నది. ఇలాంటి సందర్భంలో  స్థానికంగా కొన్ని ప్రాంతాల్లో రైతులు కూలీల కొరతను ఎదుర్కొంటున్నారు. ఈ ఖాళీని  భర్తీ చేయడానికి ఇతర రాష్ట్రాల నుంచి మగవాళ్లు, మహిళలు బృందాలుగా అతి తక్కువ రేట్లకే కూలీ పని చేయడానికి తరలి వస్తున్నారు. ఆర్థిక అనివార్యత, ఎక్కువ గంటలు పని చేస్తారు, పనులు వేగంగా అవుతాయనే భావనతో స్థానిక రైతులు కూడా వాళ్లను పనులకు పిలుస్తున్నారు. రాష్ట్రంలో ఏర్పడుతున్న పెద్ద డెయిరీలు, రైస్ మిల్లులు, చిన్న పరిశ్రమలు, ఇటుక బట్టీల్లో అత్యధికంగా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న కూలీలే ఉపాధి పొందుతున్నారు.

సమస్యలపై అధ్యయనం జరగాలి

కూలీల కొరత, ఖర్చు ఎక్కువ పేరుతో , కొన్ని వ్యవసాయ పనుల్లో యంత్రాల వాడకం పెరుగుతున్నది. కలుపు నివారణకు ఎక్కువగా విష పూరిత రసాయనాలు వాడుతున్నారు. వీటి వల్ల కూడా గ్రామీణ పేదలు అనివార్యంగా వ్యవసాయేతర కూలీ పనులకు తరలి వెళ్లాల్సి వస్తున్నది. గ్రామీణ ప్రాంతంలో పెరిగిన మద్యం అలవాటు కూడా, వ్యసనంగా మారి శారీరక శ్రమ చేసే మగవాళ్ల శక్తిని హరించివేస్తూ, ఎక్కువ గంటల పాటు, బరువైన పనులు చేయలేని స్థితి కూడా దాపురించింది. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కూలీలుగా ఎక్కువగా మహిళలే ఉన్నారు. వారి శ్రమ తోనే కుటుంబాలు నడుస్తున్నాయి. ఈ పరిణామాలను లోతుగా అధ్యయనం చేసినప్పుడే, ఈ శ్రమ జీవుల నిజమైన సమస్యలు అర్థం అవుతాయి. ఐక్య రాజ్య సమితి నిర్వచించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవాలన్నా, రాష్ట్రం మానవ అభివృద్ధి సూచీల్లో ముందుకు వెళ్లాలన్నా, అంతర్జాతీయ కార్మిక సంస్థ, ఐక్య రాజ్య సమితి మానవ హక్కుల సమితి నిర్దేశించిన హక్కులు గ్రామీణ పేదలకు దక్కాలన్నా ఈ అధ్యయనం తక్షణమే జరగాలి. 

జీవనోపాధి మార్గాలు లేక..

మానవ సమాజం పురోగమించిన కొద్దీ, ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి. జీవన ప్రమాణాలు మెరుగు పడాలంటే ఆయా కుటుంబాల, వ్యక్తుల ఆదాయాలు పెరగాలి. ఆదాయాలు పెరగాలంటే ఆయా కుటుంబాలు ఉపాధి పొందడానికి వీలుగా స్థానిక సహజ వనరులు ఉచితంగా అందుబాటులో ఉండాలి. ఆయా కుటుంబాల ఖర్చులు తగ్గేలా మౌలిక వసతులపై ప్రభుత్వాలు భారీగా పెట్టుబడులు పెట్టాలి. ఆయా కుటుంబాలకు ఉచిత వైద్యం హక్కుగా దక్కాలి. వారి పిల్లలకు నాణ్యమైన చదువు ఉచితంగా అందాలి. యువతీ యువకులకు వివిధ అంశాలపై నైపుణ్య శిక్షణలు స్థానికంగా అందించాలి. ఈ అన్నిటినీ అమలు చేయడానికి ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల కల్పన భారీగా జరగాలి. ఈ పనులన్నీ ప్రభుత్వం తగిన బడ్జెట్ కేటాయింపులతో చేయాలి. ఇవేవీ చేయకుండా తెలంగాణ గ్రామీణ సమాజాన్ని ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది. స్థానిక వనరులన్నీ ప్రజల చేతుల్లోంచి జారిపోతున్నాయి. విచ్చలవిడిగా యంత్రాలు, డ్రోన్ లు, విష రసాయనాల వినియోగం పెరుగుతున్నది.

మద్యం పారిస్తూ ప్రభుత్వం పన్నులను దండుకుంటున్నది. ఫలితంగా గ్రామీణ ప్రజల ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయి. మగవాళ్లు శారీరక శ్రమ చేసే పరిస్థితి లేకుండా పోతున్నది. ఎప్పటికప్పుడు వ్యవసాయ పనుల్లో, గ్రామాల చుట్టూ ఏర్పడుతున్న జీవనోపాధుల్లో కనీస వేతనాలు పెంచకపోవడం వల్లా, వాటి అమలు తీరును కార్మిక శాఖ పర్యవేక్షించక పోవడం వల్ల, తక్కువ కూలీ రేట్లకే ఇతర రాష్ట్రాల నుంచి వలస కూలీలు వచ్చి పడుతున్నారు. ఇది తప్పకుండా స్థానిక ప్రజల జీవనోపాధిని దెబ్బ తీస్తున్నది. ఇటీవల నల్గొండ పట్టణంలో స్థానిక కూలీలకు, వలస వచ్చిన కూలీలకు మధ్య ఘర్షణ హింసాత్మక రూపం తీసుకోవడానికి ఇదే కారణం. 100 రోజుల పని హక్కుగా ఈ కుటుంబాలకు అందించాల్సిన ఉపాధి హామీ పథకం ద్వారా కనీసం 45 రోజులు కూడా పని కల్పించడం లేదు. రేషన్ షాపుల ద్వారా కేవలం బియ్యం ఇవ్వడం వల్ల గ్రామీణ వ్యవసాయ కూలీలకు పౌష్టిక ఆహారం అందడం లేదు. కొత్తగా పెండ్లి అయిన వారికి కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వడం లేదు. 

కేరళ తరహా చర్యలు అవసరం

గ్రామీణ ప్రజల్లో సొంత భూమి ఉన్న వారికి మాత్రమే రైతు బంధు, బీమా లాంటి పథకాలు వర్తిస్తున్నాయి. భూమి లేని గ్రామీణ కుటుంబాలకు ఒక్క సాంఘిక భద్రతా పథకం కూడా లేదు. పని స్థలాలకు వెళుతూ రోడ్డు ప్రమాదాల్లో మరణించడం, శాశ్వత, పాక్షిక వికలాంగులు కావడం, పురుగు విషాలు స్ప్రే చేస్తూ అనారోగ్యానికి గురై మరణించడం, పాములు, తేళ్ల కాట్లు, విద్యుత్ షాక్, పిడుగులు పడి మరణించడం, భారీ వర్షాల వల్ల వచ్చే ఆకస్మిక వరదల్లో చిక్కుకుని కొట్టుకు పోవడం లాంటి ప్రమాదాలు పెరుగుతున్నాయి.  కానీ వీటి బారిన పడిన కూలీలకు తక్షణ వైద్య సాయం అందుబాటులో ఉండటం లేదు. వారికి ఎటువంటి పరిహారమూ అందడం లేదు. ప్రభుత్వాలు దయ తలచి ఎప్పుడో కొత్త పెన్షన్ లు మంజూరు చేస్తే తప్ప, అప్పటి వరకు అనాథల్లా బతకాల్సిందే. మద్యానికి బానిసలైన వారికి సాయం చేయడానికి కనీసం మండల స్థాయిలో కూడా డీఅడిక్షన్ సెంటర్లు అందుబాటులో లేవు.

నిజానికి సాంఘిక భద్రత ఈ ప్రజలకు హక్కుగా అందాలి. వ్యవసాయ కూలీలు నిరంతరం వంగి పని చేయడం వల్ల వారికి నడుము, మోకాళ్ల నొప్పులు పెరుగుతున్నాయి. విష రసాయనాలు చల్లే పొలాల్లో పని చేయడం వల్ల ఇతర అనారోగ్య సమస్యలూ వేధిస్తున్నాయి. ప్రభుత్వం ఈ సమస్యల గురించి పట్టించుకోవడం లేదు. కేరళ తరహాలో గ్రామీణ వ్యవసాయ కూలీలను గ్రీన్ ఆర్మీగా ఏర్పరిచి, వారికి శిక్షణ ఇస్తూ, వారు తక్కువ శ్రమతో ఈజీగా పని చేయడానికి అవసరమైన పనిముట్లు అందిస్తూ, అవసరమైన యంత్రాలను కూడా ఈ బృందాలకు మాత్రమే సమష్టిగా అందిస్తూ ఉంటే, అప్పుడు గ్రామీణ వ్యవసాయ కూలీల సమస్యలు పరిష్కారం అవుతాయి. వారి జీవనోపాధికి రక్షణ ఉంటుంది. 

- కన్నెగంటి రవి, రైతు స్వరాజ్య వేదిక