అసెంబ్లీలో చర్చకు రమ్మంటే.. వీధుల్లో అల్లరి చేస్తున్నరు : డిప్యూటీ సీఎం భట్టి

అసెంబ్లీలో చర్చకు రమ్మంటే.. వీధుల్లో అల్లరి చేస్తున్నరు :  డిప్యూటీ సీఎం భట్టి
  •  సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరింది కేసీఆర్​కు
  •  కేటీఆర్ ఎందుకు ఉలిక్కిపడుతున్నరు
  •  స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ కు డిపాజిట్లు దక్కవని ఫైర్​ 
  •  మానుకోటలో రూ.400 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన 

మహబూబాబాద్, వెలుగు:నదీ జలాలు, రాష్ట్ర అభివృద్ధిపై అసెంబ్లీలో చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేత కేసీఆర్​కు సవాల్ విసిరితే బీఆర్ఎస్​లీడర్లు వీధుల్లో అల్లరి చేస్తున్నారని డిప్యూటి సీఎం మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా పర్వతగిరి గ్రామ శివారు సోమ్లాతండా, కేసముద్రంలో రూ.400 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో డిప్యూటి సీఎం మాట్లాడుతూ కేసీఆర్​ను అసెంబ్లీకి రాకుండా కేటీఆర్​ అడ్డుపడుతున్నారని, కేసీఆర్​ను పిలిస్తే కేటీఆర్ ఎందుకు ఉలికిపడుతున్నారని ప్రశ్నించారు. కృష్ణ, గోదావరి నీళ్లపై అసెంబ్లీలో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రం ఏమైనా ఫరవాలేదు కృష్ణ, గోదావరి నీళ్లు వాడుకొమ్మని.. గతంలో సీఎంగా ఉన్న కేసీఆర్ ఏపీకి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించారు. 

బీఆర్ఎస్​నేతల భాషను ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. ఆ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావన్నారు. ఈ నెల 12 నుంచి రాష్ట్రవ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేస్తామన్నారు. రాష్ట్రంలో గతంలో కన్నా 2వేల మెగావాట్ల విద్యుత్ ఎక్కువ సప్లై చేస్తున్నట్లు తెలిపారు. రాజీవ్ యువ వికాసం స్కీంతో నిరుద్యోగ యువతకు రూ.8 వేల కోట్లతో ఉపాధి కల్పించనున్నామని చెప్పారు. రాష్ట్రంలో 1.12 కోట్ల కుటుంబాలుంటే 90 లక్షల పైగా కుటుంబాలకు ఏదో ఒక స్కీమ్ అందుతుందని తెలిపారు.

పేదల సొంతింటి కల నెరవేర్చుతున్నం: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

మొదటి విడతగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లను ఇచ్చామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ధరణి ద్వారా బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వ భూములను కాజేశారని, భూ భారతి తెచ్చి ఆ సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అధ్వానంగా ఉన్న రోడ్లను దశలవారీగా డెవలప్​చేయనున్నట్టు ఆర్ అండ్​బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. రోడ్ల కోసం ఆర్​అండ్​బీ ద్వారా రూ.6,600 కోట్ల నిధులు కేటాయించామని, పంచాయతీ రాజ్​శాఖ ద్వారా రూ.15 వేల కోట్లతో రోడ్ల రిపేర్లు, కొత్త రోడ్లు వేస్తామన్నారు. మానుకోట జిల్లాలో రోడ్ల అభివృద్ధికి రూ.200 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. మహిళలకు ఇప్పటికే రూ.25 వేల కోట్ల వడ్డీ లేని రుణాలను ఇచ్చినట్టు మంత్రి సీతక్క చెప్పారు.

 ప్రతిమహిళ బాధ్యతగా రెండు మెక్కలు నాటాలని అటవీ, దేవాదాయ శాఖమంత్రి కొండాసురేఖ కోరారు. జిల్లాలో ఆలయాల అభివృద్ధికి రూ.5 కోట్లను మంజూరు చేశామన్నారు. 9 రోజుల్లో రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమచేసినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగే శ్వరరావు తెలిపారు. మానుకోటలో గిడ్డంగుల అభివృద్దికి రూ.5 కోట్లు  మంజూరు చేశామన్నారు. మహబూబాబాద్ జిల్లాను సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో బంగారు కోటగా మార్చనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహదారు వేంనరేందర్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు భూక్య మురళీ నాయక్, జాటోతు రామచంద్రు నాయక్, కోరం కనకయ్య, కేఆర్​నాగరాజు, ఎంపీ బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.