మెడికల్ ప్రొఫెసర్లకు ప్రమోషన్లు .. 44 మంది సీనియర్ ప్రొఫెసర్లకు ఏడీఎంఈలుగా పదోన్నతి

మెడికల్ ప్రొఫెసర్లకు ప్రమోషన్లు .. 44 మంది సీనియర్ ప్రొఫెసర్లకు ఏడీఎంఈలుగా పదోన్నతి
  • ప్రిన్సిపాల్స్, సూపరింటెండెంట్లుగా నియామకం 
  • అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల ప్రమోషన్లకూ కసరత్తు 
  • త్వరలో మరో 704 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ 
  • మెడికల్ కాలేజీల్లో తప్పనున్న టీచింగ్ సమస్యలు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల్లో బోధన, పరిపాలనా సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. 44 మంది సీనియర్ ప్రొఫెసర్లకు అడిషనల్ డైరెక్టర్స్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (ఏడీఎంఈ)గా పదోన్నతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిని రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీలకు ప్రిన్సిపాళ్లుగా, టీచింగ్ ఆసుపత్రులకు సూపరింటెండెంట్లుగా నియమించింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తూ మంగళవారం జీవో జారీ చేశారు. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా రెగ్యులర్ పద్ధతిలో పరిపాలనాధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వీరిలో 23 మందిని ప్రిన్సిపాళ్ళుగా, 21 మందిని సూపరింటెండెంట్లుగా ప్రభుత్వం నియమించింది. ఇన్నాళ్లూ ఇన్‌‌‌‌చార్జ్ పదవులతో మెడికల్ కాలేజీలు, టీచింగ్ ఆసుపత్రుల పనితీరు అస్తవ్యస్తంగా మారింది. రెగ్యులర్ ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లు లేకపోవడం వల్ల బోధన నాణ్యత, ఆసుపత్రి సేవలు దెబ్బతిన్నాయి. ఈ సమస్యలను అధిగమించేందుకు ప్రభుత్వం 44 మంది ఏడీఎంఈలను నియమించడంతో మెడికల్ కాలేజీల్లో విద్యాపరమైన, ఆసుపత్రుల్లో వైద్య సేవల నాణ్యత మెరుగుపడనున్నాయి.

ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లకూ.. 

ప్రస్తుతం 278 మంది అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్లుగా పదోన్నతి ఇచ్చే ప్రక్రియ చివరి దశలో ఉంది. ఏడీఎంఈల నియామకం పూర్తయిన తర్వాత, ప్రొఫెసర్లకు త్వరలో పోస్టింగ్‌‌‌‌లు ఇవ్వనున్నారు. అదేవిధంగా, 231 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు అసోసియేట్ ప్రొఫెసర్లుగా ప్రమోషన్ కల్పించేందుకు ఆరోగ్య శాఖ చర్యలు ప్రారంభించింది. ఈ పదోన్నతుల ద్వారా ప్రొఫెసర్ల కొరత, డిపార్ట్‌‌‌‌మెంట్ హెచ్‌‌‌‌వోడీల సమస్యలు తీరనున్నాయి. అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్, ఏడీఎంఈ వంటి పోస్టులను నేరుగా రిక్రూట్ చేసే అవకాశం లేనందున, పదోన్నతుల ద్వారానే ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. 

త్వరలో మరో 704 పోస్టుల భర్తీ..  

మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌‌‌‌‌‌మెంట్ బోర్డు ఇప్పటికే 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. వీటికి అదనంగా మరో 704 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి కూడా ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. త్వరలో ఈ ఖాళీలను కూడా భర్తీ చేయనున్నారు.