చంద్రబాబుకి ఇదే చివరి ఎన్నిక: వైఎస్ జగన్

చంద్రబాబుకి ఇదే చివరి ఎన్నిక: వైఎస్ జగన్

విజయవాడ: రాబోయే 2024 ఎన్నికలు ఖచ్చితంగా చంద్రబాబుకు చివరి ఎన్నికలేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఈ సారి మా టార్గెట్ 175 నియోజకవర్గాలకు 175 సీట్లు గెలుస్తామని చెప్పారు. రాజ్యాధికారంలో భాగస్వాములను చేసేందుకు వైసీపీకి 85 వేల మంది బీసీ నేతల సైన్యం ఉందని సీఎం జగన్ ధీమా వ్యక్తం చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బీసీ వర్గాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, 56 బీసీ కార్పొరేషన్ చైర్మన్లు, రాష్ర్ట వ్యాప్తంగా ఎన్నికైన బీసీ మండల, గ్రామస్థాయి ప్రజాతినిధులతో బుధవారం వైసీపీ జయహో బీసీ మహాసభను నిర్వహించింది. ఈ సభలో  సీఎం జగన్   కీలకోపన్యాసం చేశారు.

నిజాయితీకి.. వెన్నుపోటుకు మధ్య జరిగే యుద్ధం

రానున్న ఎన్నికల్లో మారీచులు, పెత్తందారులతో యుద్ధం చేయక తప్పదని జగన్ అన్నారు.  చంద్రబాబు, ఆయన బ్యాక్‌బోన్‌ ఎల్లో బ్రదర్స్‌, దత్తపుత్రుడు ఏ సామాజిక వర్గానికి ప్రతినిధులో ఆలోచన చేయాలి. అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామంటే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని.. నిస్సిగ్గుగా కోర్టులో కేసు వేస్తున్నారని.. చివరికి అన్ని ప్రాంతాల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు మూడు రాజధానులు పెడదామంటే అడ్డుకుంటున్నారని జగన్ ఆరోపించారు. పెత్తందారుల అర్ధిక లబ్ధి కోసం చంద్రబాబు నిరంతరం తపిస్తుంటారని,  పేదల గురించి ఆలోచించే తీరిక బడా పెత్తందారులు చంద్రబాబు బినామీలకు లేదన్నారు.

 వైసీపీ  అన్ని వర్గాల సమానత్వానికి ప్రతీక  అని సీఎం జగన్ అన్నారు. నిజాయితీకి వెన్నుపోటుకు మధ్య జరిగే ఈ యుద్ధంతో వైఎస్సార్ సీపీని నడిపించే బాధ్యత బీసీలు తీసుకోవాలని జగన్ కోరారు. బీసీలను మూడున్నర దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ వారు ఉపయోగించుకున్నారే తప్ప చేసిందేమీ లేదన్నారు. బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ క్లాస్, చరిత్రలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా బీసీ కులాలకు ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేశామని వివరించారు. రాబోయే 2024 ఎన్నికల్లో ఇంతకు మించిన గెలుపు ఖాయమని.. రాష్ట్రంలోని  175 స్థానాల్లో క్లీన్ స్వీప్ చేస్తామని అన్ని నియోజకవర్గాల్లో గట్టిగా చెప్పాలని జగన్ పిలుపునిచ్చారు.