ఎనిమిదేండ్లలో కేంద్రం నుంచి రాష్ట్రానికి 22,355 కోట్లు​

ఎనిమిదేండ్లలో కేంద్రం నుంచి రాష్ట్రానికి 22,355 కోట్లు​
  • ఈజీఎస్​ ఫండ్స్​తోనే  పల్లె ప్రగతి పనులు
  • మన ఊరు–మన బడి స్కీంకూ కేంద్రం ఫండ్సే గతి
  • కొత్తగా పంచాయతీ బిల్డింగులకు ఇవే నిధులు
  • నిబంధనలకు విరుద్ధంగా చేపడుతుండడంతో సమస్యలు

మహబూబ్​నగర్, వెలుగు: అసలే అప్పులపాలై, ఖాళీ ఖజానాతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఇస్తున్న ఉపాధి నిధులు  కొండంత అండగా నిలుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి  రాష్ట్రానికి ఏటా రూ.2వేల కోట్లకు పైగా వస్తుండడంతో ఆ ఫండ్స్​తో గ్రామాల్లో అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నారు. పల్లె ప్రగతిలో భాగంగా ఇప్పటికే  ఊరూరా విలేజ్​ పార్కులు, డంప్​ యార్డులు, శ్మశాన వాటికలు,  రైతువేదికలు, కల్లాలు నిర్మించిన రాష్ట్ర ప్రభుత్వం, తాజాగా ‘మన ఊరు– మన బడి’ స్కీం కింద సర్కారు స్కూళ్ల అభివృద్ధి పనులకు కూడా ఈజీఎస్​ ఫండ్స్​నే వాడుతోంది. కొత్తగా 3,687 జీపీలలో గ్రామపంచాయతీ బిల్డింగులకు కూడా ఉపాధి నిధులే వాడుకోవాలని నిర్ణయించింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ కొన్ని పనులు ఈజీఎస్​ చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా చేపడుతుండడంతో సమస్యలు వస్తున్నాయని ఆఫీసర్లు చెప్తున్నారు. 

 రూ.20 లక్షలు ఉపయోగించుకునేలా కేంద్రం నుంచి పర్మిషన్​

కేంద్ర ప్రభుత్వం ఎనిమిదేండ్లలో రాష్ర్టానికి రూ.22,355 కోట్లఈజీఎస్​ ఫండ్స్​ కేటాయించింది. రెగ్యులర్​గా  ఫండ్స్​ వస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం కూలీలకు ఉపాధి చూపడంతోపాటు వివిధ అభివృద్ధి పనులు చేపడుతోంది. ఊరూరా సీసీ రోడ్లు,  పంట పొలాల్లో కాల్వలు, చెరువులు, కాల్వలో పూడికతీత పనులతో పాటు  పల్లె ప్రగతి కింద  రెండేళ్లుగా నిర్మిస్తున్న విలేజ్​ పార్కులు, డంప్​యార్డులు, శ్మశాన వాటికలు,  రైతువేదికలు, కల్లాల నిర్మాణానికి ఈజీఎస్​ ఫండ్స్​నే వాడుతోంది. రాష్ట్రంలో 2,601 రైతు వేదికల కోసం రూ.572.22 కోట్లు ఖర్చు చేసింది. వీటిలో రూ.260.10 కోట్లు ఈజీఎస్​ నిధులే కావడం గమనార్హం, అలాగే ఒక్కో శ్మశాన వాటికకు రూ.12 లక్షలు ఖర్చు చేయగా రూ.10 లక్షలు ఈజీఎస్ నిధులే. రాష్ట్రవ్యాప్తంగా 12,660 డంపింగ్ యార్డులకూ 90శాతం నిధులను ఈజీఎస్ ​ఫండ్స్​ నుంచే వాడుకున్నారు.  ఇటీవల ‘మన ఊరు.. మనబడి’ కింద  సర్కారు బడులను డెవలప్​ చేయాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సైతం ఈజీఎస్ ​ఫండ్స్​నే వాడుకుంటోంది. మొదటి విడత రూ.3,497.62 కోట్లతో 9,123 బడుల్లో 12 రకాల ఫెసిలిటీస్​ కల్పించాలని భావించినప్పటికీ సరిపడా ఫండ్స్​ లేక పనులు ముందుకు సాగడం లేదు.  దీంతో స్కూల్​భవనాలకు రిపేర్లు, వంటగదులు, ప్రహరీ, మరుగుదొడ్ల లాంటి నిర్మాణాలన్నీ ఈజీఎస్​ ఫండ్స్​తోనే చేపడుతోంది. కొత్తగా  3,687 పంచాయతీల్లో జీపీ భవనాల కోసం ఒక్కో బిల్డింగ్​కు రూ.20 లక్షల ఉపాధి నిధులను వినియోగించుకునేలా కేంద్రం నుంచి పర్మిషన్​ తీసుకున్నది. 

నిబంధనలు పాటించకపోవడం వల్లే సమస్యలు 

కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఈజీఎస్​ ఫండ్స్​తో రైతుల పొలాలకు రోడ్ల నిర్మాణం, పంటభూముల చదును, పొలాల్లో మట్టి కట్టలు పోయడం,  ఫాం పాండ్స్​, పశువుల పాకలు,  పశువుల తొట్లు , పౌల్ర్టీ ఫామ్స్, ఇంకుడు గంతలు, మరుగుదొడ్లు, కామన్ ​సోక్​పిట్స్, చెరువులు, చెక్​డ్యామ్​లు, బావులు, కాల్వల్లో పూడికతీత లాంటి పనులు చేపట్టాలి. కానీ రాష్ట్ర సర్కారు ఈజీఎస్ ​నిధులను నిబంధనలకు విరుద్ధంగా  రైతు వేదికలు, వైకుంఠధామాలు, డంపింగ్​యార్డులు, పల్లె ప్రృతివనాలు, క్రీడా ప్రాంగణాల నిర్మాణం కోసం వాడుకున్నది. ఉపాధి కూలీలతో 60శాతం, మెటీరియల్​ కాంపోనెంట్​ కింద 40శాతం ఖర్చు పెట్టాల్సి ఉండగా, మెటీరియల్​ కాంపోనెంట్​కే ఎక్కువ కేటాయిస్తోంది. దీనివల్ల కూలీలు ఉపాధి కోల్పోతుండగా, లెక్కల్లో తేడాలను అడ్జస్ట్​ చేసేందుకు అధికారులు తిప్పలు పడ్తున్నారు. రాష్ర్ట సర్కారు ఎనిమిది రకాల పనులను ఈజీఎస్​ చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిందని జూన్, జూలై నెలల్లో రాష్ర్టంలో పర్యటించిన కేంద్ర తనిఖీ బృందాలు తేల్చాయి. ఈ క్రమంలోనే కల్లాల నిర్మాణానికి వాడుకున్న రూ.150 కోట్లు వాపస్ ​ఇవ్వాలని కేంద్రం నోటీసులిచ్చిందని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చెప్తున్నారు.