- ఐదు రాష్ట్రాల్లో కలిపి 12.2% కోత.. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు
న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) తర్వాత ఐదు రాష్ట్రాల్లో 2.29 కోట్ల ఓటర్లు తగ్గారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్లో ఓటర్ల సంఖ్య 18.71 కోట్ల నుంచి 16.43 కోట్లకు పడిపోయింది. మొత్తంగా 12.2% కోత పడింది. యూపీలో అత్యధికంగా 13.24 శాతం తగ్గుదల నమోదైంది. వచ్చే ఏడాది ఈ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రెండో దశ సర్ తర్వాత యూపీలో ఓటర్లు 15.44 కోట్ల నుంచి 13.40 కోట్లకు తగ్గారు. 2.04 కోట్ల పేర్లు తొలగించగా.. 84 లక్షల మందిని తిరిగి చేర్చారు.
పంజాబ్లో 2.15 కోట్ల నుంచి 2.01 కోట్లకు ఓటర్లు తగ్గారు. తొలగించిన పేర్లలో 34 శాతం తిరిగి చేరాయి. ఉత్తరాఖండ్లో 80 లక్షల నుంచి 72 లక్షలకు తగ్గగా.. 3 శాతం పేర్లే తిరిగి చేరాయి. మణిపూర్లో మూడో దశ సర్ తర్వాత 20.9 లక్షల నుంచి 19.6 లక్షలకు ఓటర్లు తగ్గారు. 17 శాతం పేర్లు తిరిగి చేర్చారు. గోవాలో రెండో దశ సవరణతో 11.85 లక్షల నుంచి 10.58 లక్షలకు పడిపోయారు. ముసాయిదా జాబితా కంటే తుది జాబితాలో ఓటర్లు తగ్గిన ఏకైక రాష్ట్రం గోవా. కొత్త ఓటర్లతోపాటు వచ్చే ఏడాది జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే యువత పేర్ల నమోదుకూ అవకాశం ఉంది.
