న్యూఢిల్లీ: భారతదేశ ఆర్థిక వృద్ధి ఉపాధి కల్పిస్తున్న మాట నిజమే అయినా, కీ, నాణ్యమైన ఉపాధి అవకాశాలను మాత్రం కల్పించలేకపోతోందని ప్రముఖ డెవలప్మెంట్ ఎకనామిస్ట్ జీన్ డ్రెజ్ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో జాతీయ సలహా మండలి సభ్యుడిగా పనిచేసిన ఆయన, సోమవారం పీటీఐ వార్తాసంస్థతో మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వ విధానాల్లో నిరుద్యోగ నిర్మూలన అనేది ప్రధాన లక్ష్యంగా కనిపించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. భద్రత, సంతృప్తి, మంచి వేతనం ఉన్న ఉద్యోగాలే నిజమైన ఉపాధి అని స్పష్టం చేశారు. ప్రస్తుతం చాలా మంది భారతీయులు ఒత్తిడితో కూడిన, ప్రమాదకరమైన, తక్కువ జీతం వచ్చే పనులు చేయక తప్పని పరిస్థితి నెలకొందని ఆయన పేర్కొన్నారు.
జీతాల పెంపు తక్కువే..
గత 12 ఏళ్లుగా వేతనాల వృద్ధి నెమ్మదించినప్పటికీ, ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగాల్లో నిరుద్యోగం, వేతనాల ఊసే లేదని డ్రెజ్ విమర్శించారు. కార్మికులు ఎక్కువ అవసరమయ్యే రంగాల కంటే పెట్టుబడులు అవసరమయ్యే ( క్యాపిటల్ ఇంటెన్సివ్) రంగాలకే ఆర్థిక విధానాలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటం కూడా ఉపాధి కల్పన తగ్గడానికి ఒక కారణమని వివరించారు.
దీనికి తోడు మన దేశ కార్మికుల్లో సరైన నైపుణ్యాలు, విద్యా అర్హతలు లేకపోవడం మరో ప్రధాన సమస్య అని చెప్పారు. జార్ఖండ్లో 40 శాతం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో కేవలం ఒకే ఉపాధ్యాయుడు ఉన్నారని, ఇలాంటి విద్యావ్యవస్థ వల్ల యువతకు నాణ్యమైన విద్య అందక భవన నిర్మాణ కార్మికులుగా మారుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పెద్దోళ్లు అప్పులు ఎగ్గొడుతున్నరు
బడా పారిశ్రామికవేత్తలు దివాలా ప్రక్రియ (ఐబీసీ) ద్వారా చిన్న మొత్తాలు కట్టి భారీ అప్పుల నుంచి తప్పించుకుంటున్నారని డ్రెజ్ విమర్శించారు. వాళ్లకు న్యాయవాదులు, లాబీయిస్టుల మద్దతు ఉండటం వల్ల బ్యాంకుల నుంచి భారీగా లోన్లు తీసుకుని ఎగవేస్తున్నారని ఆరోపించారు. సామాన్యులను బ్యాంకులు ఈ–కేవైసీ పేరుతో ఇబ్బందులు పెడుతున్నాయని, కేవైసీ అప్డేట్ చేయలేదన్న నెపంతో వృద్ధుల పెన్షన్ ఖాతాలను సైతం స్తంభింపజేయడం దారుణమని డ్రెజ్ మండిపడ్డారు.
