
- 11 మృత దేహాల వెలికితీత
- విచారణకు సీఎం ఆదేశాలు
- బాధిత కుటుంబాలకు రూ. 4 లక్షల ఎక్స్ గ్రేషియా
ముంబై: మహారాష్ట్రలోని తివారే డ్యామ్ కూలి 23 మంది చనిపోయారు. కొంకణ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలతో …డ్యామ్ దిగువున ఉన్న గ్రామాలకు వరదలు వచ్చాయి. భారీవర్షాలకు పైనుంచి ఉధృతంగా వరదనీరు చేరడంతో మంగళవారం రాత్రి డ్యాం కొట్టుకుపోయిందని అధికారులు చెప్పారు. ఇంతవరకు11 మృతదేహాలను బయటకు తీసినట్టు రత్నగిరి అడిషనల్ ఎస్పీ విశాల్ గైక్వాడ్ చెప్పారు.
రత్నగిరి జిల్లా చిప్లున్ తాలూకాలోని తివారే డ్యామ్స్టోరేజీ కెపాసిటీ 20 లక్షల క్యూబెక్ మీటర్లు. ఒక్కసారిగా డ్యామ్ తెగిపోవడంతో దిగువున ఉన్న నాలుగు గ్రామాల్లోకి వరద నీరు చేరింది. 12 ఇళ్లు, 20 వెహికిల్స్ నీటిలో కొట్టుకుపోయాయి.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్‌ఎఫ్) ఘటనా స్థలానికి చేరుకుంది. గల్లంతైనవారికి కోసం వెదుకుతున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్ కు రాష్ట్ర పోలీసులు సాయపడుతున్నారు. చనిపోయినవారి మృతదేహాలను గుర్తించేందుకు డ్రోన్లను వినియోగించారు.
గత నవంబరులోనే డ్యామ్‌కు బీటలు పడ్డాయన్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వాళ్లు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. డ్యామ్ ఎవరి పరిధిలోకి వస్తుందన్న దానిపైన అధికారుల మధ్య క్లారిటీ లేదని వాళ్లు విమర్శిస్తున్నారు. డ్యామ్ చిప్లున్ తహశిల్ కిందకు వస్తుందా, దాపోలి తహశిల్ పరిధిలోకి వస్తుందా అన్న తర్జనభర్జనలతో అధికారులు తామిచ్చిన ఫిర్యాదును పట్టించుకోలేదని బాధితుడు ఒకరు ఆరోపించారు.
‘‘ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. మా పేరెంట్స్, భార్య, ఒకటిన్నరేళ్ల బాబు వరదలో కొట్టుకుపోయారు. కొట్టుకుపోయిన వెహికల్ తెచ్చుకుందామని వెళ్లిన మా తమ్ముడు కూడా ఇంతవరకు రాలేదు’’ అని బాధితుడు కన్నీరు పెట్టుకున్నాడు.
ఒక్కసారిగా వరద ఉధృతంగా రావడం, రాత్రి కావవడంతో రెస్క్యూ ఆపరేషన్లకు మొదట్లో ఆటకం కలిగిందని అధికారులు చెప్పారు. బుధవారం ఉదయం నుంచి గల్లంతైనవారి కోసం ఉధృతంగా వెదుకుతున్నామని ఉన్నతాధికారులు తెలిపారు.
డ్యామ్‌కు బీటలు పడ్డాయని అక్కడివారు ఇంతకుముందే ఫిర్యాదుచేశారని రాష్ట్ర వాటర్ రిసోర్స్ మంత్రి గిరీశ్ మహాజన్ చెప్పారు. ‘‘ 14 ఏళ్ల కిందట ఈ డ్యామ్‌ను కట్టారు. నిర్లక్ష్యం ఎక్కడ జరిగిందని తెలుసుకుని చర్యలు తీసుకుంటాం’’ అని మంత్రి అన్నారు. ఇళ్లు కొట్టుకుపోయినవారికి సురక్షిత ప్రాంతాల్లో ఇళ్లు కట్టిస్తామని ఆయన హామీ ఇచ్చారు. చనిపోయినవారి కుటుంబాలకు ఒక్కొక్కరికి నాలుగు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్టు మంత్రి మహాజన్ ప్రకటించారు. ఈ ఘటనపై విచారణ జరపాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదేశాలు జారీచేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు. జిల్లా అధికారులతో సీఎం మాట్లాడారు. పరిస్థితిని సమీక్షించి, సహాయ కార్యక్రమాలు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన అధికారులు తివారే డ్యాంను పరిశీలించారు.
స్థానికులు డ్యా మ్ కు బీటలు వచ్చాయని కంప్లైంట్ చేశారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు దృష్టికి తీసుకెళ్లాను. అయినా అధికారులు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. – వినాయక్ రౌత్, శివసేన ఎంపీ
ఇది గవర్నమెంట్ నిర్లక్ష్యమే: ఎన్సీపీ
తివారే డ్యా మ్ తెగిపోవడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. ఎంతమంది ప్రాణాలు పోతే గవర్నమెంట్ నిద్రమత్తు నుంచి మేల్కొం టుంది. జయంత్ పాటిల్, ఎన్సీపీ చీఫ్