
అమెరికాలో ముగ్గురు కుటుంబ సభ్యులను కాల్చి చంపిన 23 ఏళ్ల భారతీయ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం (నవంబర్ 22) ఉదయం ఈ ఘటన జరిగింది.గత కొద్దికాలంగా న్యూజెర్సీకి వెళ్లిన నిందితుడు.. ఆన్ లైన్ లో తుపాకి కొనుగోలు చేసి అతని తాత, నాయనమ్మ, మామలను కాల్చి చంపినట్లు అమెరికన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
గుజరాత్ కు చెందని 23 ఏళ్ల ఓం ఇటీవలే అమెరికా వెళ్లాడు.. తన తాత, నాయనమ్మలు దిలీప్ కుమార్ బ్రహ్మ భట్, బిందు భ్రహ్మభట్, మామ యష్ కుమార్ బ్రహ్మభట్ లతో కలిసి న్యూజెర్సీలో ఉంటున్నాడు. ఉన్నట్టుండి పెద్ద శబ్ధం రావడంతో పక్కింటి వారు వచ్చి చూడగా దిలీప్ కుమార్, బిందు మెట్లపై రక్తపు మడుగులో పడివున్నారు. మరోచోట యష్ కుమార్ పడి ఉన్నారు.. దిలీప్ కుమార్, బిందు స్పాట్ లోనే చనిపోగా.. యష్ కుమార్ బుల్లెట్ గాయాలతో ఆస్పత్రిలో చనిపోయాడు.
ఇంట్లో ఉన్న ఓం ను వారిపై ఎవరు కాల్పులు జరిపారని ప్రశ్నించగా ‘ అది నేనే అయి ఉండొచ్చు ’ సమాధానం చెప్పాడని పోలీసులు వెల్లడించారు. ఓం పై ఫస్ట్ డిగ్రీ మర్డర్, ఆయుధాలను కలిగి ఉన్నందుకు సెకండ్ డిగ్రీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఓం ను మిడిల్ సెక్స్ కౌంటీ అడల్ట్ కరెక్షనల్ సెంటర్ కు తరలించారు.