ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ములుగు, వెలుగు: ములుగు మండలంలోని వివిధ గ్రామాల్లో గురువారం విజిలెన్స్ ఆఫీసర్లు మెరుపు దాడులు నిర్వహించారు. కొడిశలకుంట జీపీ పరిధిలోని చంద్రు తండాకు చెందిన ధారావత్ మురళీకృష్ణ ఇంట్లో 161 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధనం చేసుకున్నారు. అదే గ్రామానికి చెందిన రేషన్ డీలర్ షాపులో 30 క్వింటాళ్లు సీజ్ చేశారు. దేవనగర్ గ్రామంలోని రేషన్ డీలర్ షాపులో 19.95 క్వింటాళ్ల బియ్యం తక్కువగా ఉందని అతనిపై కూడా కేసు నమోదు చేశారు. శ్రీనగర్​లోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 77.50క్వింటాళ్ల 155 బ్యాగులను గుర్తించామని తెలిపారు. ఆయా గ్రామాల్లో 238 క్వింటాళ్ల బియ్యం దొరకగా.. వీటి విలువ రూ.6లక్షల 20వేలు ఉంటుందని తెలిపారు.

ఆటలకొస్తే.. పస్తులు

భీమదేవరపల్లి, వెలుగు: వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం భీమదేవరపల్లి మండలకేంద్రంలో ఫ్రీడం కప్ పోటీలు జరిగాయి. ఈ పోటీలకు వివిధ ప్రభుత్వ బడులకు చెందిన 300 మంది హాజరయ్యారు. కానీ పిల్లలకు భోజన ఏర్పాట్లు చేయలేదు. కొంతమంది టీచర్లు భోజన ఏర్పాట్లు చేయగా.. చాలామంది పస్తులున్నారు. దీనిపై విద్యాశాఖ ఆఫీసర్లను వివరణ కోరగా.. భోజన ఏర్పాట్లు చేయాలని తమకు ఎలాంటి ఆదేశాలు లేవని చెప్పడం గమనార్హం.

సబ్సిడీలను వినియోగించుకోవాలి

మరిపెడ, వెలుగు: వివిధ శాఖల ద్వారా అందే సబ్సిడీ రుణాలు, యంత్రాలను ప్రజలు వినియోగించుకోవాలని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ కోరారు. గురువారం మహబూబాబాద్ జిల్లా మరిపెడలో జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించగా.. చీఫ్ గెస్టుగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. వ్యవసాయ, విద్యుత్, వైద్యం, మిషన్ భగీరథ ఆఫీసర్లకు పలు సూచనలు చేశారు. సర్పంచులు సమస్యలు పెద్దగా లేవనెత్తకపోవడంతో ఈ మీటింగ్ సాదాసీదాగా సాగింది. అనంతరం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బలహీన పిల్లలకు న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ లైబ్రరీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, ఎంపీపీ అరుణ, జడ్పీటీసీ శారద, ఎంపీడీవో ధన్సింగ్, తహసీల్దార్ రాంప్రసాద్ తదితరులున్నారు.

అర్హులందరికీ పెన్షన్లు

వర్ధన్నపేట, వెలుగు: అర్హులందరికీ ఆసరా పెన్షన్లు అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. గురువారం వర్ధన్నపేట మండలం బండౌతాపురంలో 21 మందికి కొత్తగా మంజూరైనా పెన్షన్ కార్డులు పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో నిర్మిస్తున్న శివాలయానికి భూమి పూజ చేశారు. అలాగే ఎలకంటి సావిత్రి అనే బాధితురాలికి సీఎం రిలీఫ్​ఫండ్ కింద మంజూరైన రూ.60వేల చెక్కు అందజేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తోందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోందన్నారు.

600 మీటర్ల జాతీయ జెండాతో భారీ ర్యాలీ

ములుగు, వర్ధన్నపేట, వెలుగు: స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా ములుగు జిల్లా కేంద్రంలో గురువారం 600 మీటర్ల జాతీయ జెండాతో భారీ ర్యాలీ తీశారు. ఏఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, ధర్మ జాగరణ సమితి జిల్లా అధ్యక్షుడు గండ్రకోట కుమార్ ఆధ్వర్యంలో తిరంగా యాత్ర నిర్వహించారు. యువకులు, స్టూడెంట్లు పెద్ద సంఖ్యలో హాజరై నినాదాలు చేశారు. అలాగే వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందలో 40 మీటర్ల జాతీయ జెండాను ప్రదర్శించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ జెండాను ఆవిష్కరించారు.

పైడిపల్లిలో మళ్లీ గూడారాలు

కాశిబుగ్గ, వెలుగు: వరంగల్ సిటీలోని పైడిపల్లి శివారులోని ప్రభుత్వ జాగలో సీపీఐ ఆధ్వర్యంలో పేదలు మళ్లీ గూడారాలు వేసుకున్నారు. గతంలో ఇక్కడ గూడారాలు వేసుకోగా.. పోలీసులు వాటిని తొలగించారు. ఈ సందర్భంగా సీపీఐ లీడర్లు మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్ రూం ఇవ్వకపోవడంతోనే గూడారాలు వేసుకున్నామన్నారు. వీటికి ఇండ్ల పట్టాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.