
ఆసిఫాబాద్/జైనూర్, వెలుగు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పని చేసిన దివంగత కోట్నాక భీంరావు సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. శుక్రవారం భీంరావు 23వ వర్ధంతిని నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పిల్లల పార్క్ లో ఉన్న భీంరావు విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఎస్పీ కాంతిలాల్ పాటిల్, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, గిరిజన సంఘాల నాయకులతో కలిసి విగ్రహానికి పూజలు నిర్వహించి, పూలమాలవేసి నివాళులు అర్పించారు. నేటి గిరిజన యువత భీంరావును ఆదర్శంగా తీసుకుని వారి ఆశయాల సాధన దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
సిర్పూర్ యు భీంరావు విగ్రహానికి పాక్స్ చైర్మెన్ కేంద్రీ శివాజీ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆత్రం భగవంత రావు ఆదివాసీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తొడసం ధర్మారావు, మాజీ ఎంపీటీసీ ఆత్రం వెంకట్ రావు, నాయకులు ఆత్రం రాజేశ్వర్, ఆత్రం ఓం ప్రకాశ్, ఆత్రం ఆనంద్ రావు, గడం యశ్వంతరావు తదితరులు పాల్గొన్నారు.