రైల్వేకు రికార్డ్ స్థాయిలో రూ.2.40 లక్షల కోట్లు

రైల్వేకు రికార్డ్ స్థాయిలో రూ.2.40 లక్షల కోట్లు
  • నిరుటి కంటే రూ. లక్ష కోట్లు ఎక్కువ 
  • 2013‑14తో పోలిస్తే 9 రెట్లు పెరిగిన కేటాయింపులు 
  • ట్రాక్​ల కెపాసిటీ పెంచేందుకు రూ.17 వేల కోట్లు 

న్యూఢిల్లీ:  రైల్వేశాఖకు బడ్జెట్​లో పెద్దపీట వేశారు. రికార్డ్ స్థాయిలో నిధులు కేటాయించారు. వందే భారత్, ఇతర రైళ్ల కోసం పాత ట్రాకుల సామర్థ్యం పెంచే పనులను చేపట్టనున్నారు. ప్రీమియర్ ట్రెయిన్ లలో వెయ్యికి పైగా కోచ్ లను ఆధునీకరించనున్నారు. హైడ్రోజన్ ఇంధనంతో నడిచే 35 ట్రెయిన్ లను కూడా తయారు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మల వెల్లడించారు. ఈ ఏడాది బడ్జెట్ లో రైల్వేకు మొత్తం రూ. 2.41 లక్షల కోట్లను కేటాయిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. నిరుటి అలకేషన్స్ తో పోలిస్తే ఇది రూ. లక్ష కోట్లు ఎక్కువని తెలిపారు. 2013–14 బడ్జెట్ తో పోలిస్తే.. తాజా బడ్జెట్ లో రైల్వేకు కేటాయింపులు 9 రెట్లు పెరిగాయన్నారు. మొత్తం కేటాయింపుల్లో రూ. 2.40 లక్షల కోట్లు క్యాపిటల్ ఎక్స్ పెండిచర్ కాగా, రూ. 1,267 కోట్లను రెవెన్యూ ఎక్స్ పెండిచర్ గా అంచనా వేశారు. బడ్జెట్ లో కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. బొగ్గు, ఎరువులు, ఆహారధాన్యాల రవాణాను మెరుగుపర్చేందుకు 100 ట్రాన్స్ పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులను చేపడతామన్నారు. ఇందుకోసం ప్రభుత్వం నుంచి రూ. 75 వేల కోట్లు, ప్రైవేట్ సెక్టార్ నుంచి రూ. 15 వేల కోట్లను పెట్టుబడులుగా పెడతామని పేర్కొన్నారు. అయితే, రైల్వేకు ఈ ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్, గూడ్స్, రైల్వే రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్ బోర్డులు, ఇతర మార్గాల ద్వారా మొత్తం రూ. 2,65,000 కోట్ల రెవెన్యూ వస్తుందని అంచనా వేసినట్లు కేంద్ర మంత్రి వివరించారు. 

1000కి పైగా కోచ్ ల ఆధునీకరణ 

రాజధాని, శతాబ్ది, దురంతో, హమ్ సఫర్, తేజస్ వంటి ప్రీమియర్ ట్రెయిన్ లలో 1000కి పైగా కోచ్ లను ఆధునీకరించి, ప్రయాణికులకు మరింత సౌకర్యంగా ఉండేలా తీర్చిదిద్దుతామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. రైళ్ల స్పీడ్ ను మరింత పెంచేందుకు, మరిన్ని ప్రాంతాలకు వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు వీలుగా పాత ట్రాక్ ల సామర్థ్యాన్ని పెంచనున్నట్లు తెలిపారు. ట్రాకుల సామర్థ్యం పెంచేందుకు పోయినేడాది రూ. 15,388 కోట్లు కేటాయించగా, ఈ సారి రూ. 17,296 కోట్లకు పెంచినట్లు వెల్లడించారు.