రైతుబంధు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2.47 లక్షల మంది ఎదురుచూపు

రైతుబంధు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2.47 లక్షల మంది ఎదురుచూపు
  • ఇప్పటి దాకా అప్​లోడ్​ కాని వివరాలు 
  • గతేడాది జూన్​ 20న లాస్ట్​ అప్​డేట్​
  • అగ్రికల్చర్ ఆఫీసర్లకు లాగిన్ ఇవ్వని ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: గత ఏడాది నుంచి వ్యవసాయ భూమి కొని పాస్ బుక్స్ పొందిన వారికి యాసంగి రైతు బంధు పైసలు పడడం లేదు. కొత్త పాస్ బుక్స్ వివరాలు స్థానికంగా ఏఓలు, ఏఈఓలు సేకరించినప్పటికీ.. ప్రభుత్వం నుంచి పర్మిషన్ రాకపోవడంతో ఆన్ లైన్ చేయలేకపోయారు. దీంతో ఈసారి 2.47 లక్షల మంది రైతుబంధుకు దూరం అయ్యారు. జిల్లా, మండల స్థాయి అగ్రికల్చర్ ఆఫీసర్లకు ప్రభుత్వం ఇప్పటికీ లాగిన్ ఫెసిలిటీ ఇవ్వకపోవడంతో కొత్త పట్టాదారులు నిరాశకు లోనవుతున్నారు.

ఏడాదికోసారి డేటా అప్ డేట్

రాష్ట్ర ప్రభుత్వం పట్టాదారు పాసుపుస్తకాలు కలిగిన వారికి వానాకాలం, యాసంగి సీజన్లలో ఎకరాకు రూ.5వేల చొప్పున ఏటా రూ.10 వేలు అందిస్తున్నది. ఏడాదికోసారి కొత్తగా పాస్ బుక్స్ పొందినోళ్ల డేటాను అప్ డేట్ చేస్తూ వారికి రైతు బంధు సాయం జమ చేస్తుంది. 2022 జూన్ 20 వరకు కొత్తగా పాస్ పుస్తకాలు పొందినవారి వివరాలు చివరిసారిగా ఆన్ లైన్ లో అప్ డేట్ చేశారు. ఆ తర్వాత భూములు కొనుగోలు చేసినవాళ్లు, విరాసత్/ఫౌతీ ద్వారా పాస్ బుక్స్ పొందినవాళ్లు రాష్ట్రవ్యాప్తంగా 2,47,822 మంది ఉన్నారు. వీరంతా ఆయా మండలాల్లో అగ్రికల్చర్ ఆఫీసర్లకు పాస్ బుక్ ఫస్ట్ పేజీ జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇచ్చి రైతుబంధు కోసం అప్లై చేసుకున్నారు. రైతుల వివరాలను సంబంధిత అగ్రికల్చర్ ఆఫీసర్, అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్లు రైతు బంధు పోర్టల్ లో లాగిన్ అయి నమోదు చేయాల్సి ఉన్నప్పటికీ.. ప్రభుత్వం నుంచి పర్మిషన్ రాకపోవడంతో ఆ ప్రాసెస్ ముందుకు సాగలేదని తెలిసింది.

రంగారెడ్డి జిల్లా నుంచే ఎక్కువ మంది

రైతుబంధు సాయం కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,47,822 మంది రైతులు ఎదురుచూస్తున్నారు. కొత్తగా పాస్ బుక్స్ పొందినవాళ్లలో అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 22,015 మంది, సంగారెడ్డిలో 21,576, నల్గొండలో 15,881, సిద్దిపేటలో 14,523, వికారాబాద్​లో 13,945, మెదక్​లో 11,706, మహబూబ్ నగర్​లో 10,451, నాగర్ కర్నూల్​లో 11,225, యాదాద్రి భువనగిరిలో 10,185, జగిత్యాలలో 6,468, కామారెడ్డిలో 9,844, ఖమ్మంలో 8,556, నిజామాబాద్​లో 7,176, కరీంనగర్ జిల్లాలో 6,191 మంది ఉన్నారు. మిగిలిన ప్రతీ జిల్లాలో ఐదు వేల లోపు రైతులు రైతు బంధు కోసం అప్లై చేశారు.

9 సార్లు రైతు బంధు కోల్పోయాడు

కేసముద్రం మండలం నారాయణపురానికి చెందిన రైతు బానోత్ అమ్రూకు 1.17 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. భూరికార్డుల ప్రక్షాళన సమయంలో ఆ ఊరి భూములన్నింటిని ఫారెస్ట్ భూములుగా పేర్కొనడంతో అప్పట్లో ఎవరికీ పట్టాదారు పాస్ బుక్స్ జారీ కాలేదు. చాలాసార్లు రైతుల ఆందోళనల తర్వాత నెల రోజుల కింద కొందరికి పాస్ బుక్స్ జారీ అయ్యాయి. సర్కార్ నిర్లక్ష్యం కారణంగా అతడు ఇప్పటికే 9సార్లు రైతుబంధును కోల్పోయాడు. పాస్​బుక్​ రాగానే.. రైతు బంధు కోసం అగ్రికల్చర్ ఆఫీసర్​కు అమ్రూ అప్లై చేశాడు. జనవరి 1లోపే ఈయనకు డబ్బులు జమ కావాల్సి ఉండగా.. 10వ తారీఖు వచ్చినా పడలేదు. దీంతో ఆయన వెళ్లి సంబంధిత ఆఫీసర్లను సంప్రదించగా.. ఆన్ లైన్ కాలేదన్న విషయం తెలిసింది.