మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ భార్య పేరిట 25 ఎకరాలు

మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ భార్య పేరిట 25 ఎకరాలు
  • రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లిలో ఉన్నట్లు ధరణిలో నమోదు
  • అక్కడ ఎకరా భూమి విలువ రూ.3 కోట్లకు పైనే..
  • స్టాంప్స్​ అండ్​ రిజిస్ట్రేషన్స్​లో కనిపించని కొనుగోలు ఆధారాలు
  • నిబంధనలకు అనుగుణంగానే కొన్నట్లు సోమేశ్ వివరణ
  • డీవోపీటీకి వివరాలివ్వలేదంటున్న కాంగ్రెస్ నేత మన్నె నర్సింహారెడ్డి

హైదరాబాద్, వెలుగు: మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ భార్య డాగ్యన్ముద్ర పేరిట- రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి రెవెన్యూ పరిధిలో 25 ఎకరాల భూమి ఉండటం చర్చనీయాంశమైంది. ఒక్క ఎకరా విలువ రూ.3 కోట్లకు పైగా ఉన్న ఆ ప్రాంతంలో ఏకంగా 25 ఎకరాలు ఎలా కొన్నారంటూ అధికార వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ధరణి పోర్టల్ వచ్చాక కొనుగోలు జరిగిందా లేక అంతకంటే ముందే చేశారా ఎలా కొన్నారు అనే దానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పట్టాదారు డాగ్యన్ముద్ర(తండ్రి లేదా భర్త పేరు సోమేశ్ కుమార్) పేరిట ఖాతా నం.5237 ద్వారా సర్వే నం.249/ఆ1 లో 8 ఎకరాలు, 249/ఆ2 లో 10 ఎకరాలు, 260/అ/1/1 లో 7.19 ఎకరాల వంతున మొత్తం 25.19 ఎకరాలు ఉన్నట్లు తేలింది. ధరణి పోర్టల్ లో ఈ భూమికి సంబంధించిన ఖాతా నం. 5237 గా ఉంది. నిజానికి భూ రికార్డుల ప్రక్షాళనకు ముందు ఆ స్థాయిలో భూ ఖాతాదారులు లేరు. మరి ఈ ఖాతా నంబరు ఏ విధంగా కేటాయించారన్నది ఎవరికి అంతుచిక్కడం లేదు. ఈ భూమి సేల్ డీడ్ ద్వారా కొనుగోలు చేయలేదని తెలుస్తున్నది. సాదాబైనామా ద్వారా కొనుగోలు చేశారని అంటున్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ వెబ్ సైట్ లో ఎన్ కంబరెన్స్ సర్టిఫికేట్ ను పరిశీలిస్తే కొనుగోలు చేసిన ఆధారాలు కనిపించడం లేదు.

ఇల్లు అమ్మి భూమి కొన్నట్లు వివరణ

తాను ప్రభుత్వ నిబంధనలను అనుసరించే  2018  సంవత్సరం ప్రారంభంలోనే 25 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లు సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తనకు ప్రశాసన్ నగర్ లో అలాట్ చేసిన నివాస స్థలంలో నిర్మించుకున్న గృహాన్ని విక్రయించి కొత్తపల్లి గ్రామంలో ఆరేండ్ల కిందనే ఈ వ్యవసాయ భూమి కొనుగోలు చేశానని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి ఈ భూమి కొనుగోలు కు సంబంధించి ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకున్నానని స్పష్టం చేశారు. భూమి కొనుగోలుకు అనుమతిస్తూ ప్రభుత్వం కూడా తనకు లేఖ ద్వారా అనుమతిచ్చిందని పేర్కొన్నారు. ఐఏఎస్ అధికారిగా తాను, ఉన్నత స్థాయి అధికారిగా తన భార్య సుదీర్ఘకాలం ఉద్యోగంలో ఉన్నామని ఒక ప్రకటనలో తెలిపారు.

గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఆఫీసర్లపై నిఘా పెట్టాలి

గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఆఫీసర్ల ఆస్తులపై కొత్త ప్రభుత్వం నిఘా పెట్టాలని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ధరణి భూ సమస్యల వేదిక కన్వీనర్ మన్నె నర్సింహారెడ్డి అన్నారు. బీహార్‌కు చెందిన సోమేశ్ కుమార్​కు రంగారెడ్డి జిల్లా పరిధిలో 25 ఎకరాల భూమి ఉందని.. ఏ విధమైన సంపాదనతో తెలంగాణలో వ్యవసాయ భూములను కొన్నారో తేల్చాలని కోరారు. సోషల్ మీడియా ఇలాంటి విషయాలని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. బిహారీ ఐఏఎస్ ఆఫీసర్లు తెలంగాణలో ఉన్న భూములు కొనుగోలు చేసి తమ అక్రమ ఆస్తులను పెంచుకున్నారని.. ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్ల మీద రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలని కోరారు. మరి కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఇదే పద్ధతిలో భూములు కొన్నారని.. వాటి వివరాలు కూడా త్వరలో బహిరంగపరస్తామన్నారు. ఐఏఎస్​ అధికారులు సాధారణంగా వారి ఆస్తుల వివరాలు సర్వీస్​లో ఉన్నప్పుడు డీవోపీటీకి ఇవ్వాలని.. అయితే సోమేశ్ కుమార్ ఆ వివరాలు ఇవ్వలేదని తెలిసిందన్నారు.