
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రూ. ఆరు లక్షల కోట్ల వ్యయంతో మొత్తం 10 వేల కిలోమీటర్ల మేర 25 గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేలను ప్రభుత్వం నిర్మిస్తోందని కేంద్ర రోడ్లు, రవాణాశాఖల మంత్రి నితిన్ గడ్కరీ గురువారం తెలిపారు. ఢిల్లీలో గురువారం జరిగిన పీహెచ్‌డీసీసీఐ వార్షిక సమావేశంలో మాట్లాడుతూ, తమ రోడ్డు ప్రాజెక్టులను మానిటైజ్ చేస్తే రహదారుల మంత్రిత్వ శాఖకు రూ. 15 లక్షల కోట్లు వస్తాయని ఆయన చెప్పారు.
ఎక్స్‌ప్రెస్‌వేలతో లాజిస్టిక్స్ ఖర్చులను 16 శాతం నుంచి 10 శాతానికి తగ్గించాయని మంత్రి తెలిపారు. ఇది డిసెంబర్ నాటికి 9 శాతానికి తగ్గుతుందని చెప్పారు. యుఎస్‌లో లాజిస్టిక్స్ వ్యయం 12 శాతం, యూరప్ దేశాలలో 12 శాతం, చైనాలో 8 నుంచి 10 శాతం వరకు ఉంది. రాబోయే ఐదేళ్లలో, భారత ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలో నెంబర్ వన్‌గా మార్చడమే తమ లక్ష్యమని మంత్రి అన్నారు.
"నేను రవాణా మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు, భారత ఆటోమొబైల్ పరిశ్రమ పరిమాణం రూ. 14 లక్షల కోట్లు. ప్రస్తుతం భారత ఆటోమొబైల్ పరిశ్రమ పరిమాణం రూ. 22 లక్షల కోట్లకు చేరింది. ఆటోమొబైల్ రంగం 4 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తోంది. కేంద్రానికి, రాష్ట్రాలకు అత్యధిక జీఎస్టీని అందిస్తోంది”అని గడ్కరీ తెలిపారు. మొక్కజొన్న నుంచి ఇథనాల్ ఉత్పత్తి చేయడం ద్వారా రైతులు అదనంగా రూ. 45 వేల కోట్లు సంపాదించారని గడ్కరీ వివరించారు.