కొవాగ్జిన్​ రెండో డోస్​ కోసం.. 2.5లక్షల మంది వెయిటింగ్

కొవాగ్జిన్​ రెండో డోస్​ కోసం.. 2.5లక్షల మంది వెయిటింగ్
  • వ్యాక్సినేషన్‌పై క్లారిటీ ఇవ్వని రాష్ట్ర సర్కారు
  • స్టోరేజ్‌ సెంటర్‌లో 7.73 లక్షల డోసులు
  • ప్రైవేటు వాళ్లనూ వేయనివ్వని సర్కారు
  •  బ్లాక్‌లో వ్యాక్సిన్‌ వేసే వాళ్లను ఆశ్రయిస్తున్న జనం 

హైదరాబాద్, వెలుగు: కరోనా వ్యాక్సినేషన్‌ విషయంలో రాష్ట్ర సర్కారు తీరుతో జనం ఆందోళన చెందుతున్నారు. వ్యాక్సిన్‌ వేసుకుంటే సేఫ్‌గా ఉండొచ్చని ప్రజలు ఆరాటపడుతుంటే.. ప్రభుత్వం వ్యాక్సినేషన్‌ను బంద్‌ పెట్టి ఇబ్బంది పెడుతోంది. ఫస్ట్ డోసు వ్యాక్సినేషన్ బంద్ పెట్టి రెండు వారాలు అవుతుండగా, సెకండ్ డోసు ఆపేసి వారం దాటింది.  కొవాగ్జిన్​ రెండో డోస్​ కోసం రెండున్నర లక్షల మంది ఎదురుచూస్తున్నరు. డోసుల షార్టేజీతోనే వ్యాక్సినేషన్‌ను ఆపేశామంటున్న సర్కారు.. ఇప్పుడు 7.73 లక్షల డోసులున్నా రీ స్టార్ట్ చేయట్లేదు. సరిపడా వచ్చాక స్టార్ట్ చేస్తామని హెల్త్ ఆఫీసర్లు ప్రెస్‌ మీట్లలో చెబుతున్నారు. సరిపడా అంటే ఎన్నో మాత్రం చెప్పట్లేదు. దీనిపై ఉన్నతాధికారులను ప్రశ్నిస్తే తమ చేతుల్లో ఏం లేదని, ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు నడుచుకుంటున్నామని చెబుతున్నారు. మరోవైపు  కొన్ని ప్రైవేట్ హాస్పిటళ్లు శుక్రవారం నుంచి వ్యాక్సినేషన్ స్టార్ట్ చేస్తామని గురువారం ప్రకటించాయి. దీంతో అలర్టయిన హెల్త్ ఆఫీసర్లు  హాస్పిటళ్ల యాజమాన్యాలను హెచ్చరించడంతో వెనక్కి తగ్గాయి.

ఇప్పటివరకు 10.7 లక్షల మందికే రెండు డోసులు

రాష్ర్టంలో ఇప్పటివరకు 55,23,863 మందికి వ్యాక్సిన్ వేశారు. ఇందులో 10,70,897 మందికి రెండు డోసులు పూర్తయింది. ఇంకో 44,52,966 మంది రెండో డోసు వేసుకోవాలి. వీళ్లలో 2,56,637 మంది ఈ నెల 30 వరకు సెకండ్ డోసు వేసుకోవాలి. వీళ్లంతా కొవాగ్జిన్ వేసుకున్నవాళ్లే. వీళ్లలో ఇప్పటికే చాలా మందికి సెకండ్ డోసు గడువు ముగిసింది. టైమ్‌‌‌‌‌‌‌‌కు సెకండ్ డోసు వేసుకుంటేనే కరోనా నుంచి పూర్తి రక్షణ వస్తుందని చెప్పిన ఆఫీసర్లు, ఇప్పుడు సెకండ్ డోసు బాధితుల గోడు పట్టించుకుంటలేరు. సెకండ్ డోసు కోసం ఎదురు చూస్తున్నవాళ్లు తమను క్షమించాలని ఇటీవలి ప్రెస్ మీట్‌‌‌‌‌‌‌‌లో పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. ఆ క్షమాపణలతో తమకు ఇమ్యునిటీ రాదుగా అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. సెకండ్ డోసు కోసం ప్రైవేట్ హాస్పిటళ్లను, ఎక్కువ డబ్బులు తీసుకుని బ్లాక్‌‌‌‌‌‌‌‌లో వ్యాక్సిన్ వేసే వాళ్లను జనం ఆశ్రయిస్తున్నారు.

రూరల్‌‌‌‌‌‌‌‌లో చాలా తక్కువ

పల్లెల్లో వ్యాక్సినేషన్ విస్తృతంగా చేపట్టాలని రాష్ర్ట ప్రభుత్వాలకు ప్రధాని మోడీ సూచించారు. మన స్టేట్‌‌‌‌‌‌‌‌లో మాత్రం గ్రామాల్లో ఇప్పటికీ చాలా తక్కువ మందికే వ్యాక్సిన్ వేశారు. రాష్ట్రలో వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌ వేసుకున్న 55.23 లక్షల మందిలో గ్రేటర్ హైదరాబాద్ వాళ్లే 18.69 లక్షల మంది ఉన్నారు. కరీనంగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ వంటి పట్టణ ప్రాంతాలకు చెందిన వాళ్లు మరో 10 లక్షల మంది ఉన్నారు. ఇంకో 26.54 లక్షల మందే రూరల్ ఏరియాల ప్రజలు. 9 జిల్లాల్లో లక్ష కంటే తక్కువ మందికే వ్యాక్సిన్ వేశారు. ఇందులో అత్యల్పంగా నారాయణపేట్ జిల్లాలో 37,977 మందికి, ఆసిఫాబాద్‌‌‌‌‌‌‌‌లో 48,037, గద్వాల్‌‌‌‌‌‌‌‌లో 59,799,  వనపర్తిలో 61,761, వరంగల్ రూరల్ జిల్లాలో 62,190, ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌లో 63,448 జనగాంలో 70,666, భూపాల్‌‌‌‌‌‌‌‌పల్లిలో 81,258,  మంచిర్యాలలో 96,547 మందికి వేశారు.