నాగార్జు నసాగర్ కు 25 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో

నాగార్జు నసాగర్ కు 25 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో

హాలియా, వెలుగు: శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్  ఉత్పత్తి కేంద్రం నుంచి నాగార్జునసాగర్ కు 25,789 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. జులై మొదటి వారంలోనే కృష్ణానదికి వరద మొదలు కావడంతో సాగర్ ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ముందస్తుగా సాగర్ ఎడమ కాల్వకు సాగునీటిని విడుదల చేసే అవకాశాలు న్నాయి. డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగుల కాగా, బుధవారం సాయంత్రం 6 గంటలకు 517.60 అడుగులకు చేరుకుంది.

నీటి సామర్థ్యం 312.4050 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 144.9362 టీఎంసీలుగా ఉంది. 9,874 క్యూసెక్కులు ఇన్​ఫ్లో ఉండగా, ఎస్ఎల్బీసీకి 900 క్యూసెక్కులు వదులుతున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరదల దృష్ట్యా సాగర్  ప్రాజెక్టుకు సంబంధించిన రిపేర్లు పూర్తి చేసినట్లు డ్యాం ఎస్ఈ మల్లికార్జునరావు తెలిపారు. ప్రాజెక్టు సేఫ్టీ రివ్యూ ప్యానల్​ కమిటీ సూచన మేరకు డ్యాం క్రస్ట్  గేట్లకు సంబంధించిన గ్రీజింగ్, రబ్బరు సీలింగ్, రోప్​వే వైర్ల మార్పిడి, గేట్లు, మోటార్ల రిపేర్లు, ఆయిలింగ్,​ కలరింగ్ వంటి పనులను పూర్తి చేశామని చెప్పారు.

జూరాల ప్రాజెక్టు 5 గేట్లు ఓపెన్

గద్వాల: జూరాల ప్రాజెక్టు ఐదు గేట్లను ఓపెన్ చేసి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు 67 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా, 317.190 మీటర్ల లెవెల్ ను మెయింటెన్​ చేస్తున్నారు. 5 గేట్ల ద్వారా32,675 క్యూసెక్కులు, విద్యుత్  ఉత్పత్తి ద్వారా 31,426 క్యూసెక్కులు, బీమా లిఫ్ట్–1 ద్వారా 650 క్యూసెక్కులు, కోయిల్ సాగర్  లిఫ్ట్  ద్వారా 315 క్యూసెక్కులు, లెఫ్ట్  కెనాల్ ద్వారా 550 క్యూసెక్కులు, రైట్  కెనాల్  ద్వారా280 క్యూసెక్కులు, ఆర్డీఎస్  లింక్  కెనాల్  ద్వారా 150 క్యూసెక్కులు, బీమా లిఫ్ట్–-2కు 750 క్యూసెక్కులు, సమాంతర కాల్వకు 450 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తంగా జూరాల ప్రాజెక్టు నుంచి 66,388 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.