నిరుద్యోగులకు వరంలా.. సింగరేణి మెగా జాబ్ మేళా.. 26 వేల 565 మందికి వివిధ కంపెనీల్లో కొలువులు

నిరుద్యోగులకు వరంలా.. సింగరేణి మెగా జాబ్ మేళా.. 26 వేల 565 మందికి వివిధ కంపెనీల్లో కొలువులు
  • రాష్ట్ర సర్కార్, ప్రైవేటు కంపెనీల సహకారంతో నిర్వహణ
  • కోల్ బెల్ట్ లో ఇప్పటివరకు ఎనిమిది ప్రాంతాల్లో  ఏర్పాటు 
  • జాబ్ మేళాలకు తరలివచ్చిన  75,465 మంది నిరుద్యోగులు
  • ఇంటర్వ్యూల్లో ఎంపికైన 26,565వేల మందికి ఉద్యోగ, ఉపాధి  

కోల్​బెల్ట్, వెలుగు: కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా సింగరేణి జాబ్​మేళాలు నిర్వహిస్తూ నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పిస్తోంది.  రాష్ట్ర సర్కార్, ప్రైవేటు సంస్థల సహకారంతో ఏడు నెలల్లోనే  8 జాబ్​మేళాలను నిర్వహించింది. సుమారు 250 ప్రముఖ పైవేటు కంపెనీల్లో 26,565 వేల మంది అభ్యర్థులకు వివిధ రంగాల్లో ఉద్యోగాలు కల్పించింది. ఏడో తరగతి నుంచి పోస్ట్​గ్రాడ్యుయేషన్ ​చదివిన సుమారు 75,465 మంది అభ్యర్థులు మేళాల్లో పాల్గొని విద్యార్హతకు తగిన జాబ్ లు పొందారు. మెగా జాబ్​మేళాల ఏర్పాటు, నిర్వహణలోనూ సింగరేణి అన్నితానై వ్యవహరిస్తుంది. భవిష్యత్ లో మరిన్ని జాబ్​మేళాల నిర్వహణకు ముందుకెళ్తోంది. 

నిరుద్యోగుల వద్దకే కంపెనీలు.. 

తెలంగాణలో సింగరేణి ప్రాంతం ప్రధాన ఉపాధి వనరు పేరుంది. ప్రధానంగా కోల్​బెల్ట్​ఏరియాలో బొగ్గు గనులు చాలావరకు మూతపడడంతో ఉన్నత చదువులు చదివిన కార్మికుల పిల్లలకు సరైన ఉపాధి లభించడం లేదు. దీంతో సింగరేణి మెగా జాబ్​మేళాల ఏర్పాటుకు నిర్ణయించింది. హైదరాబాద్​నుంచి ప్రముఖ కంపెనీలను తీసుకొస్తోంది. అర్హతలకు తగిన జాబ్ లను ఎంచుకునేలా నిరుద్యోగులకు అవకాశం కల్పిస్తోంది. రాష్ట్ర సర్కార్​సంకల్పా నికి అనుగుణంగా చర్యలు తీసుకుంటోంది. మెగా జాబ్​మేళాలను సక్సెస్​చేస్తోంది.  తొలిసారిగా పలు పట్టణాల్లో మెగా జాబ్​మేళాలను ఒక ఉత్సవంలా  నిర్వహిస్తోంది.  

అన్ని సదుపాయాలు కల్పిస్తూ.. 

రాష్ట్ర సర్కార్, తెలంగాణ డిజిటల్​ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్, సింగరేణి కాలరీస్​సహకారంతో కోల్​బెల్ట్​ ఏరియాలో మెగా జాబ్​మేళాలను నిర్వహిస్తూ.. మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, చైర్మన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ, పోలీస్​,పరిశ్రమల శాఖల ఉన్నతాధికారులను ప్రత్యేకంగా ఆహ్వానిస్తోంది.  మేళాకు వచ్చే నిరుద్యోగులకు ఆర్టీసీ బస్సులు, ప్రత్యేక వాహనాలను సమకూర్చుతోంది.  వేలాదిగా యువత అప్లికేషన్లను ఆఫ్​లైన్​,ఆన్​లైన్​లో చేసుకునే సదుపాయం కూడా కల్పిస్తోంది. రిజిస్ర్టేషన్​సమయంలో పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేయిస్తోంది. 

జాబ్ మేళాలో నిరుద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ కుండా హెల్ప్​డెస్క్​లను కూడా ఏర్పాటు చేస్తోంది.  కంపెనీల వివరాలను కేటగిరి వారీగా ఫ్లెక్సీలో ప్రదర్శి స్తోంది. జాబ్ మేళాలపై ప్రచారం కూడా చేస్తూ.. అభ్యర్థులతో ఇంటర్వ్యులు, సెలక్షన్​ చేసుకునేలా ప్రత్యేక ఏర్పా ట్లు అందుబాటులో ఉంచుతోంది. జాబ్ మేళాకు హాజరైన నిరుద్యోగులకు ఉదయం టిఫిన్స్, మధ్యాహ్నం భోజ నం వసతి కూడా కల్పిస్తోంది. ఏప్రిల్​లో నుంచి ఇప్పటివరకు 8  మెగా జాబ్​మేళాలను విజయవంతంగా నిర్వహించింది. 

నిరుద్యోగుల వద్దకే కంపెనీలను తీసుకొస్తున్నాం 

నిరుద్యోగులు అర్హత కలిగిన జాబ్ లను పొందేందుకు మెగా జాబ్​మేళాలను నిర్వహిస్తున్నాం. హైదరాబాద్​నుంచి ప్రముఖ కంపెనీలను తీసుకొస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా మా వంతు సహకారం అందిస్తున్నాం.  మెగా జాబ్​మేళాల ద్వారా ప్రైవేటుసెక్టార్ లో కూడా వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వచ్చేలా ప్రోత్సహిస్తున్నాం. మరిన్ని ప్రాంతాల్లో మెగా జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తాం. 
– ఎన్.బలరాంనాయక్, సింగరేణి సీఎండీ 

హెచ్ఆర్ జాబ్ వచ్చింది 

హైదరాబాద్​కు చెందిన కంపెనీలో హెచ్​ఆర్​గా జాబ్ రావడం సంతోషంగా ఉంది. బెల్లంపల్లిలో నిర్వహించిన మెగా జాబ్​మేళా నాలో  ఆత్మవిశ్వాసాన్ని నింపింది.  కోల్​బెల్ట్​ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి జాబ్​మేళా నిర్వహించడం,  రాష్ట్ర సర్కార్, సింగరేణి  ప్రోత్సాహం బాగుంది.
-రేణికుంట్ల సోనీ, మంచిర్యాల జిల్లా

మెగా జాబ్​మేళాలు ఇలా..

స్థలం         తేదీ       అభ్యర్థులు         జాబ్ పొందినవారు ​ 

మధిర       ఏప్రిల్,​21              5,000                 2,300

భూపాలపల్లి      ఏప్రిల్,​27     3,500                 2,000

గోదావరిఖని            మే, 18    5,100                    3,029

వైరా            మే, 24                  12,000                  4,041

హుజుర్​నగర్   ​        అక్టోబర్,​ 25     20,500         4,574

సత్తుపల్లి        అక్టోబర్,​ 26            14,318                4,611

బెల్లంపల్లి          అక్టోబర్,​ 26            6,547             3,095

కొత్తగూడెం           నవంబర్,​ 16         8,500           2,915