కుప్వారా జిల్లాలో ఉగ్రదాడి.. ముగ్గురు సిఆర్‌పీఎఫ్ సిబ్బంది మృతి

కుప్వారా జిల్లాలో ఉగ్రదాడి.. ముగ్గురు సిఆర్‌పీఎఫ్ సిబ్బంది మృతి

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి దాడుల‌కు తెగబడ్డారు. కుప్వారా జిల్లాలోని ఖజియాబాద్ ఏరియాలో సిఆర్‌పీఎఫ్ బృందంపై ఎదురుకాల్పులు జ‌రిపారు. సోమవారం జరిపిన ఉగ్రదాడిలో ముగ్గురు సిఆర్‌పీఎఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఒక ఉగ్రవాది హతమయ్యాడు. మరో ఏడుగురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు గాయపడ్డారు.

ఈ విష‌యం తెలుసుకున్న అదనపు బలగాలు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని గాయపడ్డ జవాన్లను ఆస్పత్రులకు తరలించారు. ఈ కాల్పుల్లో హతమైన ఉగ్రవాదికి ఏ ఉగ్రసంస్థతో సంబంధాలున్నాయనేది తెలియాల్సి ఉంది.

రెండు రోజుల క్రితం హంద్వారా సెక్టార్‌లో ఉగ్రవాదులు దాడి చేసి కల్నల్‌ అశుతోష్‌ శర్మ సహా ఐదుగురు జవాన్లను కాల్చిచంపారు. ఈ షాక్‌ నుంచి తేరుకోక ముందే కుప్వారాలో మ‌రో ఉగ్రదాడి జ‌ర‌గ‌డంతో భద్రతా బలగాలను ఉలిక్కిపడేలా చేసింది. హంద్వారా ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఆర్మీ సిబ్బంది వీరమరణం పొందగా, ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మే 2న ఈ ఎన్‌కౌంటర్ జ‌రిగింది.