Liquor scam case : సీబీఐ కస్టడీకి ఎమ్మెల్సీ కవిత మాజీ సీఏ

Liquor scam case : సీబీఐ కస్టడీకి ఎమ్మెల్సీ కవిత మాజీ సీఏ

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవిత మాజీ సీఏ గోరంట్ల బుచ్చిబాబు సీబీఐ కస్టడీకి కోర్టు ఓకే చెప్పింది. సీబీఐ అధికారులు5 రోజుల కస్టడీ కోరగా.. రౌస్ ఎవెన్యూ కోర్టు 3 రోజులు మాత్రమే అనుమతించింది. లిక్కర్ స్కాంలో మంగళవారం అరెస్ట్ చేసిన బుచ్చిబాబును సీబీఐ మధ్యాహ్నం కోర్టులో హజరుపరిచి కస్టడీ కోరింది. ఆయన తరఫున వాదనలు వినిపించిన అడ్వొకేట్ ప్రమోద్ కుమార్ దూబే కస్టడీని వ్యతిరేకించారు. కేసు దర్యాప్తునకు సహకరిస్తున్నందున కస్టడీ అవసరంలేదని కోర్టుకు విన్నవించారు. వృత్తిపరంగా బుచ్చిబాబు క్లయింటుకు సేవలందించారని, ఓ సమావేశంలో పాల్గొన్నంత మాత్రాన బుచ్చిబాబుపై నిందలు మోపడం సరికాదని అన్నారు. లిక్కర్ స్కాం కేసులో బుచ్చిబాబు లబ్దిదారుడు కాదని, ఆయన ద్వారా డబ్బులు చేతులు మారలేదన్న విషయాన్ని న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. మరోవైపు చట్టప్రకారమే బుచ్చిబాబును అరెస్ట్ చేశామన్న సీబీఐ తరఫు న్యాయవాది కేసు విచారణకు సహకరించనందునే ఆయన కస్టడీ కోరుతున్నట్లు చెప్పారు. ఇరు పక్షాల వాదనలు విన్న స్పెషల్ కోర్టు జడ్జి బుచ్చిబాబును 3 రోజుల సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

మరోవైపు లిక్కర్ స్కాంకు సంబంధించి ఈడీ అరెస్ట్ చేసిన గౌతమ్ మల్హోత్రా వారం రోజుల కస్టడీకి రౌస్ ఎవెన్యూ కోర్టు అనుమతించింది. ఫిబ్రవరి 15 వరకు ఈడీ కస్టడీకి ఓకే చెబుతూ ఉత్తర్వులు జారీ చేసింది.