అఫ్గాన్‌ బోర్డర్‌‌లో సూసైడ్ బాంబ్: ముగ్గురు పాక్ సోల్జర్స్ మృతి

అఫ్గాన్‌ బోర్డర్‌‌లో సూసైడ్ బాంబ్: ముగ్గురు పాక్ సోల్జర్స్ మృతి

పాకిస్థాన్‌లోని క్వెట్టా ప్రావిన్స్‌లో టెర్రరిస్టులు ఆత్మాహుతి దాడి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడి చేసింది తామేనని తెహ్రీక్ తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ) ఉగ్ర సంస్థ ప్రకటించుకుంది.

క్వెట్టా ప్రావిన్స్‌లోని మియాన్‌ ఘుండీ ప్రాంతంలో బాంబు పేలుడుతో దద్ధరిల్లింది. అఫ్గాన్ సరిహద్దు చెక్‌ పోస్ట్‌కు సమీపంలో బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి తనను తాను పేల్చుకున్నాడు. ఆ సరిహద్దు వద్ద పహారా ఉండే ఫ్రాంటియర్ కానిస్టేబులరీ గార్డ్స్‌ టార్గెట్‌గా ఈ అటాక్ జరిగిందని క్వెట్టా డిప్యూటీ జనరల్ ఆఫ్​ పోలీస్ అజార్ అక్రమ్‌ తెలిపారు. ఈ దాడిలో ముగ్గురు పాకిస్థాన్ పారామిలటరీ జవాన్లు మరణించారని, మరో 20 మందికి గాయాలయ్యాయని చెప్పారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని, గాయపడిన వారిలో జవాన్లతో పాటు సామాన్య పౌరులు కూడా ఉన్నారని అన్నారు.

ఫ్రాంటియర్ కానిస్టేబులరీ గార్డ్స్‌ చెక్‌ పోస్ట్ టార్గెట్‌గా జరిగిన సూసైడ్ బాంబ్ అటాక్‌ను పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ ఖండించారు. ఈ ఘటనలో అమరులైన జవాన్ల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని ఇమ్రాన్‌ చెప్పారు. సెక్యూరిటీ ఫోర్సెస్‌, విదేశీ అండతో దాడులు చేస్తున్న ఉగ్రవాదులను ఎదుర్కోవడంలో అమరులైన జవాన్ల త్యాగాలకు సెల్యూట్ అని ఇమ్రాన్‌ ఖాన్‌ ట్వీట్ చేశారు.