
- ఫెస్టివల్ సీజన్లో 3 లక్షల జాబ్స్.. ఆన్‌లైన్ షాపింగ్ కంపెనీల నుంచే ఎక్కువ
న్యూఢిల్లీ: కరోనా వల్ల ఉపాధి కోల్పోయి కష్టాలు పడుతున్న గిగ్ వర్కర్లకు (టెంపరరీ కార్మికులు) భారీ ఎత్తున జాబ్స్ ఇవ్వడానికి కంపెనీలు రెడీ అవుతున్నాయి. ఆన్‌లైన్ షాపింగ్, ఫుడ్-టెక్, లాజిస్టిక్స్, రిటైల్ కంపెనీలు పండగ అవసరాల కోసం మూడు లక్షల మందిని తీసుకోబోతున్నాయి. గత ఏడాది ఫెస్టివల్ సీజన్‌తో పోలిస్తే ఈసారి 35 శాతం మందిని అదనంగా తీసుకుంటామని చెబుతున్నాయి. ఫెస్టివల్ సీజన్‌లో డిస్కౌంట్లు, ఆకర్షణీయమైన ఆఫర్లు ఉంటాయి కాబట్టి అమ్మకాలూ ఎక్కువగానే ఉంటాయి. వీటికి తగ్గట్టు టెంపరరీ వర్కర్లు అవసరం. త్వరలో పెద్ద ఎత్తున రిక్రూటింగ్ ఉంటుందని స్టాఫింగ్ అండ్ రిక్రూటింగ్ కంపెనీలు అడెకో, రాండ్‌స్టాడ్, మ్యాన్‌పవర్, క్వెస్, సీఐఈఎల్ హెచ్ఆర్ సర్వీసెస్, టీమ్‌లీజ్ వంటివి చెబుతున్నాయి. కరోనా రిస్ట్రిక్షన్లు ఎత్తేయడం, కస్టమర్ సెంటిమెంట్ బాగుండటం వల్ల ఈసారి పండగ -సీజన్లో డిమాండ్ కచ్చితంగా పెరుగుతుందని కంపెనీలు నమ్మకంగా ఉన్నాయి. ఆన్‌లైన్ షాపింగ్ మరింత పుంజుకుంటుంది కాబట్టి డెలివరీ, లాజిస్టిక్స్, వేర్‌హౌస్ సెగ్మెంట్లలో పనిచేయడానికి వేలాది మంది గిగ్‌వర్కర్లు అవసరం. సాధారణంగా ఈ కార్మికులు డెలివరీ చేయడం, ప్యాకింగ్ చేయడం, సామాన్లు సర్దడం వంటి పనులు చేస్తారు.
ఏటా పెరుగుదల..
రాండ్‌స్టాడ్ ఇండియా స్టాఫింగ్ డైరెక్టర్ యెషబ్ గిరి మాట్లాడుతూ ‘‘ఏటా గిగ్‌వర్కర్ల రిక్రూట్‌మెంట్ల నంబర్లు పెరుగుతూనే ఉన్నాయి. 2019లో గిగ్ వర్కర్ల నియామకం 2018 సంవత్సరం కంటే 15శాతం ఎక్కువ. 2020లో ఇది 20 శాతం పెరిగింది. టైర్ 2 & 3 నగరాల నుండి ఎక్కువ డిమాండ్ ఉండడమే దీనికి కారణం. ఈ ఏడాది కూడా గిగ్ వర్కర్లకు డిమాండ్ పెరిగింది. చాలా మంది ఆఫ్‌లైన్ రిటైలర్లు ఆన్‌లైన్ బాట పట్టారు. గత సంవత్సరం కంటే రిక్రూట్‌మెంట్లు 35 శాతం ఎక్కువగా ఉంటాయి’’ అని ఆయన వివరించారు. కరోనా థర్డ్ వేవ్‌ను సమర్థంగా అడ్డుకోగలిగితే రిక్రూట్‌మెంట్లు 35శాతంపైన కూడా ఉండవచ్చని గిరి అన్నారు. మ్యాన్‌పవర్ సీనియర్ డైరెక్టర్ అలోక్ కుమార్ మాట్లాడుతూ, ఆన్‌లైన్ షాపింగ్, లాజిస్టిక్స్, కన్జూమర్ డ్యూరబుల్స్, లైఫ్‌స్టైల్ ప్రొడక్టుల కంపెనీలు ఈ సీజన్‌లో మూడు లక్షల పైగా జాబ్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని వివరించారు. అంతేగాక కార్మికుల జీతాలూ పెరగవచ్చని అన్నారు. ప్రస్తుతం గిగ్‌వర్కర్లకు నెలకు రూ.18 వేల వరకు ఇస్తున్నాయని, ఈసారి ఈ మొత్తం రూ.20 వేలు దాటొచ్చని టీమ్‌లీజ్ సర్వీసెస్ కో–ఫౌండర్ రీతుపర్ణ చక్రవర్తి అన్నారు. కిందటి ఏడాదితో పోలిస్తే ఈసారి పండగ అమ్మకాల్లో 40 శాతం ఎదుగుదల ఉండొచ్చని చెప్పారు. టైర్ 3, 4 నగరాల జనం మరింత షాపింగ్ చేస్తారన్నది ఆమె అంచనా. క్వెస్ కార్ప్‌లో వర్క్‌ఫోర్స్ మేనేజ్‌మెంట్ ప్రెసిడెంట్ లోహిత్ భాటియా కూడా ఇదే తరహాలో మాట్లాడారు. ‘‘ఈసారి గిగ్ వర్కర్ల రిక్రూమెంట్ అదనంగా 30 శాతం వరకు ఉంటుంది. ఈ–కామర్స్, లాజిస్టిక్స్ కంపెనీలు మునుపటి కంటే ఎక్కువ మందిని తీసుకుంటే ఈ నంబరు ఇంకా పెరుగుతుంది’’ అని ఆయన పేర్కొన్నారు. కార్మికుల జీతాలు ఈ సంవత్సరం 20 శాతం పెరగవచ్చని, ఈసారి తమ క్లయింట్ల నుంచి డిమాండ్ 50 % వరకు పెరగొచ్చని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఈ జాబ్స్‌కు డిమాండ్ ఎక్కువ..
డెలివరీ ఏజెంట్లు, పికర్స్/ప్యాకర్స్, స్టోర్ ప్రమోటర్లు, లాజిస్టిక్స్ సిబ్బంది, ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లు, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌లకు డిమాండ్ ఎక్కువగా ఉందని అడెక్కో ఇండియా జనరల్ స్టాఫ్ డైరెక్టర్ మను సైగల్ అన్నారు. 2020 పండుగ సీజన్లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ 17 వేల సీజనల్ జాబ్స్ ఇచ్చాయి. ఈసారి ఆన్‌లైన్ షాపింగ్ కచ్చితంగా పెరుగుతుందని, గిగ్‌వర్కర్లు కూడా మరింత మంది కావాలని మింత్రా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు వివరించారు. ఈ ఏడాది మార్చి నుంచి మే వరకు ఫ్లిప్‌కార్ట్ 23 వేల మందిని నియమించుకుంది.