- 40% మంది నెలవారీ ఆదాయం కేవలం రూ.15వేల లోపే
- సెలవు లేదు.. ఉద్యోగ భద్రత లేదు
- గిగ్ వర్కర్లకు లోన్లు బంద్.. ‘తిన్-ఫైల్’ పేరుతో తిరస్కారం
- శ్రమకు దక్కని ఫలితం.. ఇది పార్ట్‌టైం ఉపాధి అంటున్న అగ్రిగేటర్లు
- ఫుల్‌టైంగా మార్చుకున్న గిగ్ వర్కర్లు
- అసంఘటిత కార్మికుల బతుకు చిత్రాన్ని ఆవిష్కరించిన ఎకనామిక్ సర్వే
హైదరాబాద్, వెలుగు: స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు, ఎప్పుడైనా పని చేసుకోవచ్చు.. ఎవరికీ తలవంచాల్సిన పనిలేదు అని సంబరపడే గిగ్ వర్కర్ల బతుకులు.. తెరవెనుక అల్గారిథమ్ చేతిలో కీలుబొమ్మలుగా మారుతున్నాయి. స్విగ్గీ, జొమాటో, ఓలా, ఉబర్ వంటి ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఉపాధి పొందుతున్న లక్షలాది మంది కార్మికులు స్వేచ్ఛగా పనిచేస్తున్నామని అనుకుంటున్నా, వారి పని గంటలు, వేతనాలు, పనుల కేటాయింపు అన్నీ ఓ కనిపించని సాంకేతికత (అల్గారిథమ్) నియంత్రిస్తున్నది. ఈ మేరకు ఆర్థిక సర్వే 2025-–26 ఈ చేదు నిజాలను వెల్లడించింది. ఏఐ, మెషిన్ లర్నింగ్ రాకతో గిగ్ వర్కర్లపై పర్యవేక్షణ పెరిగింది. అల్గారిథమ్‌లు పనిని కేటాయించడం, రేటింగ్ ఇవ్వడం వంటివి కార్మికుల్లో మానసిక ఒత్తిడిని పెంచుతున్నాయి. ఉదాహరణకు జొమాటో, స్విగ్గి దాంట్లో ఏ ఆర్డర్ ఎవరికి వెళ్లాలి? ఏ రూట్‌లో వెళ్లాలి? ఆ పనికి ఎంత ధర నిర్ణయించాలి? ఇలా ప్రతిదీ ఓ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ నిర్దేశిస్తుందే తప్ప, ఇందులో కార్మికుడికి ఎంపిక చేసుకునే అవకాశం శూన్యం. రేటింగ్స్, ఇన్సెంటివ్స్, సర్జ్ ప్రైసింగ్ పేరిట అల్గారిథమ్ సృష్టించే మాయాజాలంలో చిక్కుకుని, గమ్యస్థానాలను చేరే క్రమంలో కార్మికులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. సాంకేతికత మాటున సాగే ఈ శ్రమ దోపిడీలో మనుషుల పర్యవేక్షణ లేకుండా యంత్రాలే వారి భవిష్యత్తును నిర్ణయిస్తుండటంతో, గిగ్ వర్కర్లు కార్పొరేట్ కంపెనీల లాభాల వేటలో పావులుగా మిగిలిపోతున్నారని నివేదిక స్పష్టం చేసింది. మరోవైపు, తక్కువ నైపుణ్యం అవసరమయ్యే డేటా ఎంట్రీ, కస్టమర్ సపోర్ట్ వంటి గిగ్ ఉద్యోగాలను ఏఐ రీప్లేస్ చేసే ప్రమాదం పొంచి ఉందని సర్వే హెచ్చరించింది. 2030 నాటికి గిగ్ వర్క్‌ఫోర్స్‌లో 33.8 శాతం మంది తక్కువ నైపుణ్యం గలవారే ఉంటారని అంచనా.
రుణాలకు అనర్హులు!
రాత్రీపగలూ అనే తేడా లేకుండా, ఎండనకా వాననకా రోడ్లమీద తిరుగుతూ సేవలు అందిస్తున్నప్పటికీ.. వారి చేతికి అందుతున్న ఫలితం మాత్రం అంతంతమాత్రమే. దేశంలోని గిగ్ వర్కర్లలో దాదాపు 40 శాతం మంది నెలవారీ ఆదాయం కేవలం రూ.15,000లోపే ఉంటున్నదని ఎకనామిక్ సర్వే గణాంకాలతో బయటపెట్టింది. పెరిగిన పెట్రోల్ ధరలు, వాహన నిర్వహణ ఖర్చులు, ఇంటర్నెట్ చార్జీలు పోను.. మిగిలేది అతి తక్కువ మొత్తమే. కుటుంబ పోషణ భారంగా మారిన నేపథ్యంలో, కనీస వేతన చట్టాలు వీరికి వర్తించకపోవడం గమనార్హం. శారీరక శ్రమకు తగిన ప్రతిఫలం దక్కకపోగా, తీవ్రమైన ఆర్థిక అనిశ్చితి వీరిని వెంటాడుతున్నదని పేర్కొన్నది. సంప్రదాయ ఉద్యోగులకు ఉన్నట్లుగా వీరికి పే-స్లిప్పులు ఉండవు, ఉద్యోగ భద్రతకు భరోసా ఉండదని, ఫలితంగా బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థలు వీరికి రుణాలు ఇచ్చేందుకు ముఖం చాటేస్తున్నాయని సర్వే నివేదికలో స్పష్టం చేశారు. వీరి క్రెడిట్ హిస్టరీని అంచనా వేయడానికి సరైన డాక్యుమెంట్లు లేకపోవడాన్ని బ్యాంకింగ్ పరిభాషలో ‘తిన్-ఫైల్’ అంటారు. ఇదే సాకుతో గిగ్ వర్కర్లకు రుణాలు నిరాకరిస్తున్న వైనాన్ని ఎత్తిచూపింది.
2030 నాటికి 2.35 కోట్లు... సంక్షేమ నిధికి వాటా గిగ్ ఎకానమీ శరవేగంగా విస్తరిస్తున్నది. 2020–21లో 77 లక్షలుగా ఉన్న గిగ్ వర్కర్ల సంఖ్య, 2024–25 నాటికి 1.20 కోట్లకు చేరింది. 2029–30 నాటికి దేశంలోని మొత్తం నాన్-అగ్రికల్చర్ వర్క్‌ఫోర్స్‌లో వీరు 6.7 శాతానికి (సుమారు 2.35 కోట్ల మంది) చేరుకుంటారని అంచనా వేస్తున్నారు. అయితే, ఈ పెరుగుదల కేవలం అంకెల్లోనే కాకుండా, కార్మికుల జీవన ప్రమాణాల్లోనూ కనిపించాల్సిన అవసరం ఉందని ఆర్థిక సర్వే నొక్కి చెప్పింది. ఈ నేపథ్యంలో గిగ్ వర్కర్ల కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం సామాజిక భద్రతా కోడ్ 2020 ద్వారా కొన్ని రక్షణలను ప్రతిపాదించింది. అగ్రిగేటర్ కంపెనీలు తమ వార్షిక టర్నోవర్‌లో 1 నుంచి 2 శాతాన్ని లేదా కార్మికుల చెల్లింపుల్లో 5 శాతాన్ని సామాజిక భద్రతా నిధికి కేటాయించాలని సూచించింది. దీని ద్వారా లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, పెన్షన్ వంటి సౌకర్యాలు కల్పించే అవకాశం ఉంది. అయితే, ఇది పకడ్బందీగా అమలైతేనే అసంఘటిత కార్మికుల బతుకుల్లో వెలుగులు నిండుతాయి. అల్గారిథమ్ ఆటలో పావులుగా మారిన వారిని, ఆర్థిక భద్రత కలిగిన పౌరులుగా మార్చడానికి తక్షణ విధానపరమైన జోక్యం అత్యవసరమని
సర్వే సూచించింది.
భద్రతలేని బతుకులు.. పార్ట్ టైమ్ కాదు.. ‘ఫుల్’ కష్టం
అనారోగ్యం పాలైనా, ప్రమాదం జరిగినా ఆదుకునే నాథుడే లేడు. పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ వంటి సామాజిక భద్రతా పథకాలేవీ వీరికి వర్తించడం లేదని ఎకనామిక్ సర్వే వెల్లడించింది. మహిళా గిగ్ వర్కర్లకు కనీసం ప్రసూతి సెలవులు కూడా దక్కని పరిస్థితి. అగ్రిగేటర్ సంస్థలు వీరిని ఉద్యోగులుగా కాకుండా ‘కాంట్రాక్టర్లు’ లేదా ‘భాగస్వాములు’ గా పరిగణిస్తుండటంతో చట్టపరమైన సౌకర్యాలకు దూరమవుతున్నారు. సెలవు తీసుకుంటే ఆరోజు ఆదాయం కోల్పోవాల్సిందే. అల్గారిథమ్ నిర్దేశించే లక్ష్యాలను ఛేదించే క్రమంలో ఎదురయ్యే మానసిక ఆందోళన, ప్రమాదాల బారిన పడుతున్నా పట్టించుకునే వ్యవస్థ లేకపోవడం గిగ్ ఎకానమీలో దాగి ఉన్న చీకటి కోణంగా ఎకనామిక్ సర్వే అభివర్ణించింది. ఇదొక పార్ట్-టైం ఉపాధి మాత్రమేనని, అదనపు ఆదాయం కోసమే దీనిని ఎంచుకోవాలని అగ్రిగేటర్ సంస్థలు వాదిస్తున్నాయి. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. దేశంలో నిరుద్యోగ సమస్య కారణంగా మెజారిటీ యువత దీనినే ఫుల్-టైం ఉపాధిగా మార్చుకుంటున్నారు. రోజుకు 10 నుంచి 12 గంటల పాటు కష్టపడుతూ, దీనిపైనే పూర్తిగా ఆధారపడుతున్నారు.
